మాన్సాస్ ట్రస్టు ఉద్యోగుల ఆందోళనపై మాజీ చైర్మన్ సంచయిత స్పందించారు. తన బాబాయి అశోక్ గజపతి రాజే వారిని రెచ్చగొట్టి ఆందోళనకు పురిగోల్పారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె కామెంట్ చేశారు.
“అశోక్‌బాబాయ్ గారూ… మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు. ఆయన రక్షణకోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడ్డం లేదా? సిబ్బందిని తప్పుదోవ పట్టించి, వారిని రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్ విద్యాసంస్థలను వేదికగా చేసుకోకండి. తాతగారు పీవీజీ రాజుగారు, నాన్నగారు ఆనందగజపతిగారు మాన్సాస్ సంస్థలను గొప్పగా తీర్చిదిద్దారు. ఆ వారసత్వాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.
తమకు 16 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ ట్రస్ట్ ఉద్యోగులు నిన్న ఈవో వెంకటేశ్వర రావు ను నిలదీశారు. వెంటనే చెల్లించాలంటూ ఆందోళన చేసి కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని సంతిమ్పజేశారు. మగళవారం నాటికి సమస్యను పరిష్కరిస్తామని ఈవో హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. జీతాలు ఎందుకు ఆపారో తనకు అర్ధం కావడం లేదని, హైకోర్టు ఆర్డర్ ఇచ్చి తాను మళ్ళీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈవో ఇంతవరకూ తనను కలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాలు ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందని అయన ప్రశ్నించారు. దీనిపై సంచయిత స్పందించారు.