కల్యాణ్ రామ్ హీరోగాను .. నిర్మాతగాను ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ ముందుకు వెళుతున్నాడు. సాధారణంగా ఒకటి రెండు ఫ్లాపులు ఎదురైతే తాము ఇక హీరోగా పనిరామనుకుని వేరే రూట్ ను వెతుక్కుంటూ ఉంటారు. అలాగే ఒకటి రెండు సినిమాలు దెబ్బతింటే, ఇక సొంత బ్యానర్ కి తెర దింపేసి వేరే బిజినెస్ కి వెళ్లిపోతుంటారు. కానీ అలా చేయకపోవడమే కల్యాణ్ రామ్ ప్రత్యేకత .. ఆయన చేసిన అలాంటి సాహసం వల్లనే ‘బింబిసార’ ఆయన కెరియర్లో చెప్పుకోదగిన స్థానంలో నిలిచింది.
హీరోగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలనుకున్న హీరోలు స్టార్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేయాలనుకుంటారు. ఇక నిర్మాతగా డబ్బు పెట్టాలనుకుంటే స్టార్ డైరెక్టర్స్ నే తీసుకోవాలనుకుంటారు. కానీ కల్యాణ్ రామ్ అలా కాదు .. తాను గనుక కథను నమ్మితే, కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడరు. ఆ దర్శకుడిని నమ్మి కోట్ల రూపాయాలను పెట్టడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటారు. అందువల్లనే ఆయన కెరియర్లో సక్సెస్ ల కంటే సాహసాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
కల్యాణ్ రామ్ ద్వారా దర్శకులుగా పరిచయమైనవారు ఇండస్ట్రీలో చాలామందినే కనిపిస్తూ ఉంటారు. ‘అతనొక్కడే’ సినిమా ద్వారా సురేందర్ రెడ్డినీ .. ‘పటాస్’ తో అనిల్ రావిపూడిని .. ‘118’ ద్వారా కేవీ గుహన్ ను .. ‘బింబిసార’ ద్వారా వశిష్ఠను పరిచయం చేసిన ఆయన, తాజాగా ‘అమిగోస్’ సినిమా ద్వారా రాజేంద్ర రెడ్డిని పరిచయం చేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.
Also Read : ‘అమిగోస్’ సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?