తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నా అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. అవసరమైతే ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత మేం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర మూడవ రోజు మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుగొండ గ్రామం వద్ద ప్రారంభమై మధ్యాహ్నం వరకు ఈడులపుసపల్లి వరకు కొనసాగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రారంభమై మహబూబాబాద్ పట్టణం చేరుకుంది. పట్టణంలోని కోర్టు సర్కిల్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
రేవంత్ ప్రసంగంలో ముఖ్యాంశాలు
ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిందని, అది ముఖ్యమంత్రి అధికారిక నివాసమని రేవంత్ అన్నారు. ప్రజా దర్బార్ నిర్వహించడానికే ప్రగతి భవన్ ఉండాలన్నారు. గతంలో చంద్రబాబు, వైఎస్ ప్రజలను కలవలేదా? ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకు? నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్న కేసీఆర్ ను ఎలా సమర్దించారు.? ఇప్పుడు నేను మాట్లాడితే ఎందుకు తప్పుపడుతున్నారు?
తెలంగాణ ద్రోహులకు, తన బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా? తెలంగాణ ప్రజల ఆలోచననే నేను చెప్పా. నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మా యాత్ర. మేం గాంధీ వారసులం.. హింసకు వ్యతిరేకం.. శాంతి కోసమే ఈ యాత్ర. తెలంగాణ వచ్చాక ఎన్కౌంటర్ లు ఉండవని కేసీఆర్ చెప్పాడు. రాష్ట్రం వచ్చాక జరిగిన ఎంకౌంటర్లకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు? 9నెలల్లో ప్రగతి భవన్, 12 నెలల్లో సచివాలయం కట్టారు. కానీ 9 ఏళ్లలో అమరుల స్థూపం కట్టలేకపోయారు. వృథా ఖర్చులు తగ్గిస్తే రాష్ట్రం మిగులు బడ్జెట్ లోకి వెళుతుంది.