తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆదివాసీలకు అవమానం జరిగిందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఎనిమిదిన్నర ఏళ్లు అయినా ఒక్క ఎకరాకు పోడు పట్టా ఇవ్వలేదన్నారు. జనగామ జిల్లాలో సాగుతున్న ప్రజాప్రస్థానం యాత్రలో షర్మిల ఈ రోజు (శనివారం) మీడియాతో మాట్లాడుతూ… గిరిజనులను సీఎం కేసీఆర్ కబ్జాకోరులు, దురాక్రమణదారులు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ‘‘ఎన్నికల కోసం 6 నెలల్లోనే పోడు పట్టాలు అని హామీ ఇచ్చిన సన్నాసి ఎవడు..?’’ అంటూ విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం ఆదివాసీల హక్కు అంటారని.. ఇప్పుడు ప్రభుత్వం దయ తలచాలి అని అంటారా అంటూ వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రశ్నించారు.
2018 ఎన్నికల్లో కుర్చీ వేసుకొని కూర్చోని పోడు రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. 2019 అసెంబ్లీలో ఆదివాసీ బిడ్డలకు పోడు భూములకు హక్కు ఉందని చెప్పారని గుర్తుచేశారు. అడవి బిడ్డల జన్మ హక్కు అని అన్నారన్నారు. 6 నెలల్లో ఇస్తామని 4 ఏళ్లు దాటినా పట్టాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పట్టాలు ఇవ్వక పోగా లక్షల ఎకరాల్లో ట్రెంచ్‌లు వేశారని.. మొక్కలు నాటారని… గిరిజన బిడ్డలను అరిగొస పెట్టారని అన్నారు. వేల మంది మీద కేసులు పెట్టారని…లాఠీ ఛార్జ్‌లు కూడా చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీలో అడవి బిడ్డల గురించి నీచంగా మాట్లాడారని, గిరిజనులను కించపరిచారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరణి పథకం పెట్టీ.. తెలంగాణలో లక్షల ఎకరాలు దురాక్రమణ చేసింది మీ కుటుంబమని సిఎం కెసిఆర్ ను ఉద్దేశిస్తూ వైఎస్ షర్మిల ఆరోపించారు. భూ ఆక్రమణలు,కబ్జాలకు పాల్పడింది మీరు…తెలంగాణ ఆస్తులను మీరు అమ్ముతున్నారు..ఆ అమ్మే హక్కు మీకు ఎవరు ఇచ్చారని సిఎం ను ప్రశ్నించారు. రాజీవ్ స్వగృహ భూములు మీరు అమ్మడం లేదా..? ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికి మీకు అనుమతి ఎవరు ఇచ్చారన్నారు. పోడు పట్టాలు ఇవ్వాలనే చిత్తశుద్ది సిఎం కెసిఆర్ కు లేదని వైఎస్ షర్మిల ఆరోపించారు.
Also Read : తెలంగాణలో అరోగ్యశ్రీ అభాసుపాలు -YS షర్మిల