సమ సమాజం, గ్రామ స్వరాజం కోసం మహనీయులు చూపిన బాటలో ఒక అడుగు ముందుకేసి పని చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని గర్వంగా చెప్పుకుంటామన్నారు.
గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు, వెనుకబడిన, అణగారిన వర్గాల ప్రజలను కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూసేవారని, జగన్ మాత్రం అన్నివర్గాలను సమానంగా చూడటమే కాకుండా వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ సమన్యాయపాలనతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని వ్యాఖ్యానించారు.
శంకర నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యాంశాలు
- అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులోను అణగారిన వర్గాల ఆర్థిక పురోభివృద్ధి, గౌరవం, రాజకీయ ఉన్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.
- తన క్యాబినెట్ లో 60 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించారు.
- దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వెనకబడిన వర్గాల కోసం రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
- అనంతపురం జిల్లాలో కురుబ కులానికి చెందిన తనకు మంత్రి పదవి ఇచ్చి కీలకమైన బాధ్యతలు అప్పగించారు.
- రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, వారి బాధలు తీర్చాలని, వారిని సంతోషంగా ఉంచాలని తన పాదయాత్ర హామీలను నెరవేరుస్తూ ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు.
- ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డి పదికాలాలపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాం