Monday, September 23, 2024
HomeTrending Newsఎల్లుండి కొండగట్టుకు సిఎం కెసిఆర్

ఎల్లుండి కొండగట్టుకు సిఎం కెసిఆర్

సీఎం కేసీఆర్ ఈ నెల 14న జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టులో పర్యటించనున్నారు. యాదాద్రిని రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పునఃనిర్మాణం చేసిన సీఎం కేసీఆర్.. వేములవాడ, కొండగట్టు ఆలయాలను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి 100 కోట్లు కేటాయించారు. యాదాద్రి తర్వాత సీఎం కేసీఆర్ కొండగట్టుపై దృష్టి సారించారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి (మంగళవారం) కేసీఆర్ కొండగట్టుకు రానున్నారు. మొదట స్వామివారిని సీఎం కేసీఆర్ దర్శించుకుంటారు. అనంతరం.. కొండగట్టు ఆలయాన్ని పూర్తిగా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ భాస్కర్ ఏర్పాట్లను పరిశీలించారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఉన్న హెలిప్యాడ్‌ను ఎస్పీ పరిశీలించారు.

మరోవైపు ఈ రోజు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి కొండగట్టులో పర్యటిస్తున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పునఃనిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి.. కొండగట్టు అభివృద్ధిలోనూ తన పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. అయితే.. యాదాద్రి పునఃనిర్మాణం సమయంలో పూర్తి మాస్టర్ ప్లాన్ రూపొందించి.. అద్భుతంగా తీర్చిదిద్దిన ఆనంద్ సాయికే.. ఇప్పుడు కొండగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతలను సీఎం కేసీఆర్ అప్పగించినట్టు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్