రంజీ ట్రోఫీ -2023-23 కోసం ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు తలపడనున్నాయి. నేడు ముగిసిన సెమీ ఫైనల్స్ లో మధ్య ప్రదేశ్ పై బెంగ్లా 306 పరుగుల భారీ తేడాతో విజయం సాధించగా, రెండో సెమీస్ లో కర్ణాటకపై సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నిన్న రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 279 పరుగుల వద్ద చివరిరోజు ఆట మొదలు పెట్టిన బెంగాల్ అదే స్కోరు వద్ద ఆలౌట్ అయ్యింది. 547 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్య ప్రదేశ్ 241 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బెంగాల్ బౌలర్ ప్రదీప్త ప్రామాణిక్ ఐదు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మధ్య ప్రదేశ్ లో రజత్ పతీదార్(52); యష్ దూబే(30); అనుభవ్ అగర్వాల్(30); ఆదిత్య శ్రీవాత్సవ (29) మాత్రమే రాణించారు. రెండు ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో రాణించిన ఆకాష్ దీప్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
బెంగుళూరులో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో…. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 123 పరుగుల వద్ద నేడు చివరిరోజు ఆట మొదలు పెట్టిన కర్నాటక 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నికిన్ జోస్ సెంచరీ (109)తో రాణించాడు.115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట 34.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ అర్పిత్ వసవడ 47 పరుగులతో నాటౌట్ గా నిలిచి గెలుపులో కీలక భూమిక పోషించాడు.
తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించిన వసవడ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
ఫిబ్రవరి 16 నుంచి 20 వ తేదీ వరకూ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో రంజీ ట్రోఫీ ఫైనల్ జరగనుంది.