Friday, October 18, 2024
HomeTrending Newsవేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూడాలి: పెద్దిరెడ్డి

వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూడాలి: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో మార్చి నాటికి 1.25 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 100 కొత్త సబ్ స్టేషన్లు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు కంపెనీల బకాయిల వసూళ్ళపై దృష్టి సారించాలని, తక్షణం బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇంధనశాఖపై మంత్రి పెద్దిరెడ్డి  సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను రైతన్నలకు అందించాలని మంత్రి స్పష్టం చేశారు. రానున్న వేసవిలో డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ ఉత్పాదనకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని, కృష్ణపట్నం, ఎన్టిటిపిఎస్ లోని కొత్త యూనిట్లను కూడా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం రోజుకు 210 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ డిమాండ్ 240 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్ళకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను పెంచుకొని,  వేసవిలో డిమాండ్ కు తగినట్లు అవసరమైతే బయటి నుంచి విద్యుత్ కొనుగోళ్ళు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కర్మాగారాలు, వ్యాపార సంస్థల నుంచి హెచ్ టి కనెక్షన్ ల నుంచి దాదాపు రూ.349 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, వీటి వసూలుపై  డిస్కంలు దృష్టి సారించాలని… రానున్న రెండు నెలల్లో ఈ బకాయిలను నూరుశాతం వసూలు చేయాలని తేల్చి చెప్పారు.

ఈ సమీక్షలో పాల్గొన్న ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్, ట్రాన్స్ కో సిఎండి బి.శ్రీధర్, జెఎండి ఐ.పృథ్వితేజ్, విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, ట్రాన్స్ కో సిఎండిలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్