మన రాష్ట్రానికి సంబంధించిన నీటి హక్కులు, జల విధానంపై స్పష్టంగా, గట్టిగా మాట్లాడే వ్యక్తులు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నీటి ప్రాజెక్టులు ‘వనరులు-సవాళ్లు’ అంశంపై విజయవాడలో బిజెపి ఏపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బిజెపి కో-ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్, ఎమ్మెల్సీ మాధవ్, బిజెపి నేతలు, నీటిపారుదల రంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ విభజన సమయంలో కలిసి ఉండాలని పోరాడాం కానీ రావాల్సినవి సాధించుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. భద్రాచలం ను ఆంధ్ర ప్రదేశ్ లో కలపాలని తాను డిమాండ్ చేసిన విషయాన్ని వీరాజు గుర్తు చేశారు.
సిఎం జగన్ పర్యటనపై సోము వీర్రాజు సెటైర్లు వేశారు. నేటి ఉదయం ట్వీట్ చేస్తూ…. “మీ ఈ పర్యటనలో కనీసం కొంత సమయం అయినా పునరావాస ప్రాంతాలలో పర్యటించి, వారు పడుతున్న అనేక అవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించి, అపరిశుభ్ర వాతావరణం వల్ల వచ్చే వ్యాధులతో వారి జీవితాలు మరింత దుర్భరవమవకముందే తక్షణమే అధికారులతో సమీక్షించి,తగు చర్యలు తీసుకోవాలి అని బిజెపి ఆంధ్ర ప్రదేశ్ డిమాండ్ చేస్తున్నది” అంటూ ట్వీట్ చేశారు.
ఈరోజు మీ పోలవరం పర్యటన షెడ్యూల్ ను చూస్తే కేవలం ఓట్ల కోసం మాత్రమే మీ తాపత్రయమనేది స్పష్టంగా అర్థమవుతోందని సోము ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుపైన ఉన్న శ్రద్ధ, ఆ ప్రాజెక్టు కట్టడానికి తమ సర్వస్వాన్ని వదులుకున్న ముంపు ప్రాంత వాసులపై లేదనేది అర్ధమవుతోన్దన్నారు. ఈ ధోరణిని బిజెపి ఆంధ్రప్రదేశ్ ఎంత మాత్రం సహించదని పేర్కొన్నారు.