చదువు పూర్తిచేసుకుని న్యాయవృత్తిలోకి వచ్చిన తర్వాత తొలి మూడు సంవత్సరాలు వారు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తోడుగా ఉందనే భరోసా ఇవ్వడం కోసం ఈ లా నేస్తం అనే పథకాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ.1,00,55,000ను క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి సిఎం విడుదల చేశారు. ఈ పథకం యువ న్యాయవాదులకు వారి వృత్తిలో ఊతమివ్వడంతో పాటు స్ధిరపడ్డానికి కూడా సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
“న్యాయవాది వృత్తిని ఎంచుకుని, మన రాజ్యాంగాన్ని, చట్టాన్ని చదువుకుని న్యాయవాదులుగా స్ధిరపడడానికి… తొలుత మూడు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది నా పాదయాత్రలో చాలా సందర్భాలలో నా దృష్టికి తీసుకొచ్చారు. వీళ్లంతా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే ఒక గొప్ప వ్యవస్ధ. వీళ్లు బాగా ఉండి, మంచి న్యాయవాదులుగా స్ధిరపడితే న్యాయవృత్తిలో వీళ్లకు మంచి జరిగితే.. ప్రభుత్వం చేసిన ఈ మంచి ద్వారా వాళ్ల మనసుల్లో ఒక స్ధానం ఏర్పడుతుంది. ప్రభుత్వం తోడుగా నిలబడ్డం వల్ల డబ్బులేని పేదవాడికి సహాయం చేయగలుగుతారనే విశ్వాసం ఉంది. ప్రభుత్వం కూడా మనకి ఈ మాదిరిగానే తోడుగా నిలబడింది కదా.. మనం కూడా అలా పేదవాడికి సాయం చేయాలన్న తలంపు మనసులో రావాలన్నది మన ఆరాటం” అన్నారు.
” ఈ సందర్భంగా ప్రతి న్యాయవాదికి కూడా నేను ఒక మాట చెప్పాలి. న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం.. సైనికుడి చేతిలో ఉన్న తుపాకీ వంటిది, హంతకుడు చేతిలో ఉండే బాకు లాంటిది కాదని అంటారు. నేను మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఈ పథకం ద్వారా ఎవరైతే ప్రభుత్వం చేస్తున్న మంచిని పొందుతున్నారో వాళ్లు దాన్ని జ్ఞాపకం పెట్టుకుని.. ఇదే అంకిత భావాన్ని పేదవాడి పట్ల చూపాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇంకా మంచి జరగాలని మీ వృత్తుల్లో మీరు ఇంకా రాణించాలని, దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను” అని సిఎం ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జూనియర్ న్యాయవాదులు వర్చువల్‌గా సిఎంతో ముఖాముఖి మాట్లాడి కృతజ్ఞతలు తెలియజేశారు.