హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు, డ్రగ్స్ దందాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తాండూరులో పోలీసుల సమక్షంలోనే బీజేపీ నేత మురళీగౌడ్ నివాసంపై దాడులు జరిపి పసిపిల్లలని చూడకుండా కుటుంబ సభ్యులను చంపే యత్నం చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘పోలీసులు చేతగానివాళ్లా? మాపై కూడా దాడులు జరిగాయని పోలీసులు చెప్పడం సిగ్గు చేటు…మీలాంటి వాళ్లకు డ్యూటీ ఎందుకు? తప్పుకుని ఇంట్లో కూర్చోండి’’అన్నారు. తక్షణమే డీజీపీ స్పందించి బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, వీరేందర్ గౌడ్ సహా పలువురు బీజేపీ నేతలు, భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి తాండూరు విచ్చేసిన బండి సంజయ్ మురళీ గౌడ్ నివాసానికి వెళ్లారు. మురళీ గౌడ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అందులో ముఖ్యాంశాలు….
• రెండ్రోజుల క్రితం బీజేపీ నాయకులు, గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ మురళీగౌడ్ నివాసంపై టీఆర్ఎస్ గూండాలు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ కుటుంబాన్ని చంపే యత్నం చేశారు. తెలంగాణ సమాజమంతా చూసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. బుద్ది, జ్ఝానం ఉన్నోళ్లకు తెలుసు. స్వార్థ బుద్ధి ఉన్నవాళ్లకు ఇది తెలియదు.
• రాజకీయాలతో కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. మీకు చేతనైతే నేతలతో కొట్లాడండి. కానీ బలుపెక్కి డ్రగ్స్ తీసుకుని, మందుతాగి వచ్చి దాడి చేశారు. వాళ్లను టెస్ట్ చేయాలి.
• దాడి చేసిన కుటుంబ సభ్యులకు ఈ వీడియో చూపించండి… చిన్న పిల్లలపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశామని చెప్పండి… చెప్పు తీసుకుని కొడతారు. ఇంట్ల తిండికూడా పెట్టరు. రాజకీయాలతో పిల్లలకు ఏం సంబంధం?
• ఒకప్పుడు నక్సలైట్లను ఎదిరించి చంపుతారని తెలిసినా, బుల్లెట్లకు ఎదురొడ్డి ప్రాణత్యాగం చేసిన పోలీసులను గుర్తుంచుకోండి. అప్పుడైనా ధైర్యం వస్తదమో. ఈ జిల్లాలో పోలీసులు చేతగాని వ్యవస్థలో ఉన్నారు. వీళ్లను చూస్తే ఎన్ని లంగా దందాలైనా చేయొచ్చనే ధీమా క్రిమినల్స్ కు వస్తుంది. బీఆర్ఎసస్ నాయకుల ఆశీస్సులుంటే దోచుకోవచ్చనే భావన వస్తుంది.
• పోలీస్ వ్యవస్థపై నమ్మకం కుదరాలంటే…. గూండాలను నిలువరించలేని పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పోలీసులపై దాడులు చేసినా కేసులు పెట్టలేదు? మిమ్ముల్ని చూసి కిందిస్థాయి సిబ్బంది సిగ్గు పడుతున్నారు. నిజాయితీగల పోలీసులు ఈ ఉద్యోగం వద్దని లూప్ లైన్ కు పోతున్నరు.
• పోలీసులు, బీఆర్ఎస్ నేతలను హెచ్చరిస్తున్నా…. మీ అధికారం 3 నెలలే. ఆ తరువాత మీ దుకాణం బంద్ అయితది. డీజీపీ వెంటనే స్పందించాలి. బాధ్యులపై హత్యాయత్నం కేసు పెట్టాలి.
• కేసీఆర్ సర్కార్ మోచేతి నీళ్లు తాగే, కాసులకు కక్కుర్తి పడి కొన్ని ఉద్యోగ సంఘాలు దాసోహమవుతున్నాయి. వీటివల్ల ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు.
• కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడంపై అడిగిన ప్రశ్నకు…. సాయన్న ఏమైనా పైసలున్నోడా? దళితుడు. పైసలున్నోడికి, రిగ్గింగ్ చేసి గెలిచినోళ్లకు అధికారికంగా అంత్యక్రియలు జరుపుతారు. వాడెవడో ఇస్తాంబుల్ చనిపోయిన నిజాం మనువడు చనిపోతే పెళ్లి కొడుకులా పిలిచి టోపీ పెట్టుకుని వెళ్లి అధికారికంగా అంత్యక్రియలు చేశాడు. తెలంగాణ మహిళల బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన నీచ చరిత్ర నిజాం రాజుది.
• కేసీఆర్ కొడుకు సీఎం కావాలనుకున్నడు. ఆయన తొట్టి గ్యాంగ్ కేటీఆర్ సీఎం కావాలని సంతకాలు సేకరణ చేపడితే… సాయన్న సంతకం పెట్టలేదు. తెలంగాణ ఉద్యమకారులకు సీఎంగా అవకాశమివ్వాలని అడిగితే… అక్కసుతో కేసీఆర్ కొడుకు ఆదేశాల మేరకు అధికారికంగా అంత్యక్రియలు జరపలేదు. ఇది వాస్తవం.
• (వరంగల్ లో వేధింపులు భరించలేక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడంపట్ల అడిగిన ప్రశ్నకు….) హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్, భూ దందాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణగా మారిపోయింది. బీఆర్ఎస్ నేతలు ఈ అడ్డగోలు దందాలతో రెచ్చిపోతున్నరు. పక్కనే ఉన్న యాలాలలో విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేశారు. వరంగల్ లో వేధింపులు భరించలేక ప్రీతి అనే మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సామాన్యులకు తెలంగాణలో విలువ లేదు. కుక్కలకంటే హీనమైంది. వేధింపులపై ముందే ప్రీతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈరోజు మళ్లీ ఏదో ఒక కథ అల్లుతారు. బూతు పత్రిక ద్వారా ప్రచారం చేయిస్తారు.
• టిక్కెట్ల అంశంపై అడిగిన ప్రశ్నకు… పార్టీ జాతీయ కమిటీ, పార్టీ పార్లమెంటరీ బోర్డు చూసుకుంటుంది.
Also Read : మూతపడ్డ ఫైనాన్స్ కొత్త అవతారమే బీఆర్ఎస్ బండి సంజయ్