Un(a)fair War:
“బోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః ।
అబోధోపహతాః చాన్యే జీర్ణమంగే సుభాషితమ్ ॥ “
“బోద్ధలగు వారు మత్సర పూర్ణమతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజులబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు”
మొదటిది అత్యంత ప్రాచుర్యంలో ఉన్న భర్తృహరి నీతి శ్లోకం. రెండోది తెలుగులో అంతే ప్రాచుర్యంలో ఉన్న ఏనుగు లక్ష్మణ కవి దానికి చేసిన అనువాద పద్యం.
భావం:-
బోధించే స్థానంలో ఉన్న గురువులు మదమాత్సర్యాలతో అసూయాపరులై ఉన్నారు. పాలించే ప్రభువులు గర్వంతో కన్ను మిన్ను కానక ఉన్నారు. పాపం- సామాన్యులు విని అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు కాబట్టి మంచిమాటలు నాలోనే జీర్ణమైపోయాయి.
ఈ ఉపోద్ఘాతాన్ని ఉపసంహారంలో చూద్దాం. ఈలోపు కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల సోషల్ మీడియా యుద్ధం ఏమిటో చూసి వద్దాం. ఒకరు ఐ ఏ ఎస్. మరొకరు ఐ పి ఎస్. ఇద్దరూ కెరీర్ తొలినాళ్లలో మంచి పేరు తెచ్చుకుని జాతీయ వార్తలకెక్కినవారే. తరువాత ఇద్దరూ వివాదాల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నవారే.
ఎవరిది తప్పు?
ఎవరిది ఒప్పు?
వారి మధ్య సిగపట్లకు ఏ పాత పగలు కారణం అన్నవి ఇక్కడ అనవసరం.
సర్వీసు నిబంధనల ప్రకారం-
ఇలా బజారున పడి వాదులాడుకోవడం తప్పు.
కొంచెం లోతుగా ఆలోచిస్తే…
సూపర్ మ్యాన్, సూపర్ వుమన్ బ్రాండ్ వచ్చిన ఎవరయినా కొంతకాలానికి తమను తాము దైవాంశ సంభూతులుగా అనుకుని…
నేల విడిచి సాము చేస్తూ ఉంటారు.
ఐ ఏ ఎస్ , ఐ పి ఎస్ అధికారులేమీ ఆకాశం నుండి ఊడిపడరు. వాళ్లూ మామూలు మనుషులే. అనేక వడపోత పరీక్షల్లో లక్షల మందితో పోటీలు పడి ఒకరిగా ఎంపికవుతారు. ఎంపికయ్యాక కూడా తగిన శిక్షణ తప్పనిసరి. ఆ తరువాత కొలువుల్లోకి వస్తారు.
బయట లక్షల, కోట్ల నెల జీతాలు వచ్చే కార్పొరేట్ ప్రయివేటు కొలువులు మొదలయ్యాక ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ ఉద్యోగాల మీద ఇదివరకటి వ్యామోహం లేదేమో? అయినా అధికార దర్పంలో ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రజలు ఎన్నుకున్న పార్టీలు అధికారం చలాయించడం నిజమే. కానీ ప్రభుత్వ నిర్వహణ అంతా ఐ ఏ ఎస్ ల చేతుల్లోనే ఉంటుంది. దాంతో ఒక రాష్త్రాన్నో, ఒక దేశాన్నో తామే నడిపిస్తున్నామన్న ఒక అలౌకిక భావన ఏదో వారిలో గూడు కట్టుకుంటుంది.
తామరాకు మీద నీటి బిందువులా తమ పని తాము చేసుకుంటూ…వ్యవస్థలను రక్షించి, వ్యవస్థలకు గౌరవం అద్ది…ప్రజలకు చేతనయిన సేవ చేసి…పదవీ విరమణ చేసిన వందల, వేల మంది అత్యున్నత ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ లు ఉన్నట్లే…
వ్యవస్థలను కెలికి, తాము సర్వోన్నతులమని చాటుకోవడంలో వ్యవస్థలను కించపరిచిన, పరుస్తున్న అధికారులు కూడా ఉన్నారు.
పేరు ప్రతిష్ఠలు, అధికార హోదాలు మహా చెడ్డవి. ఎంతటి సర్వసంగ పరిత్యాగినయినా పడదోస్తాయి.
“నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే…”
అని శ్రీశ్రీ ఊరికే అనలేదు. అప్పుడు పొగిడి…పూలు చల్లి…బ్రహ్మరథం పట్టినవారే ఇప్పుడు తిడుతున్నారు. రాళ్లు రువ్వుతున్నారు. ఛీకొడుతున్నారు.
బుద్ధిగా ఉండాల్సినవారు, ఎదుటివారికి బుద్ధి చెప్పాల్సిన వారు అసూయ ద్వేషాలతో దారి తప్పారు.
ప్రభువుల సంగతి సరే సరి. ఎవరు వినాలి ఈ పెద్దల కొద్ది బుద్ధులను?
ఎవరు చెప్పాలి వీరికి బుద్ధి?
“జీర్ణమంగే సుభాషితం”
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :
Also Read :