Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచైనా యువత పడక ఉద్యమం

చైనా యువత పడక ఉద్యమం

Why China’s youth are ‘lying flat’ – Tang ping Movement

‘మనిషన్నాక కాస్త కళా పోషణ ఉండాలి’ అంటాడు రావు గోపాల్రావు ముత్యాలముగ్గు సినిమాలో. అవన్నీ మా దేశంలో కుదరదు అంటుంది చైనా. అక్కడ మనిషనే వాడు ఉదయం నుంచి రాత్రివరకు గానుగెద్దులా పని చేయాల్సిందే. అదే దేశ భక్తి.

ఇప్పుడంటే చైనా పేరెత్తితే చిరాకొచ్చేస్తోందిగానీ మనం వాడేవన్నీ మేడ్ ఇన్ చైనాయే. కుప్పలు తెప్పలుగా ఉత్పత్తులు ప్రపంచం మీద వదలడంలో చైనాకు సాటి లేదు. కానీ అందుకు అక్కడి కార్మికులు చెల్లిస్తున్న మూల్యం తెలుసా! క్రమశిక్షణకు మారుపేరైన చైనాలో చాపకింద నీరులా మొదలైన ‘లయింగ్ ఫ్లాట్’ (టాంగ్ పింగ్)ఉద్యమం విన్నారా?

హాయిగా వెల్లకిలా పడుకుని ఏ పనీ చేయకుండా ఉండటమే ‘లయింగ్ ఫ్లాట్’. ఎంత కష్టపడినా పెరిగే ధరలకు తగ్గట్టు జీతాలు పెరగకపోవడం చైనా యువతరాన్ని కలవరపెడుతోంది. మరోపక్క నిరుద్యోగమూ పెరుగుతోంది. ఒక్క ఏడాదిలో 20 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు వస్తున్నారు.

Tang ping Movement

ఒకప్పుడు కష్టపడితే మంచి జీవితమనే భావన ఉండేది. ఇప్పుడో! వస్తువుల కోసం కష్టపడేకన్నా ఇష్టంగా పడుకుంటే మేలు అని భావిస్తున్నారు. ముందుగా ఒక ఫ్యాక్టరీ కార్మికుడు ఉద్యోగం మానేసాడు. దాచుకున్న సొమ్ముతో టిబెట్ వెళ్ళిపోయాడు. తానున్న రూమ్, పరదాలు, వెల్లకిలా పడుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ‘లయింగ్ ఫ్లాట్ ఈజ్ జస్టిస్’ అని పోస్ట్ చేసాడు . అవికాస్తా వైరల్ అయి లక్షలాది నవతరం తారక మంత్రమైంది.

అసలు చైనాలో ఎప్పటినుంచో 9 -9 -6 పని వేళలపై నిరసన వ్యక్తమవుతోంది. అక్కడ వారానికి ఆరు రోజులు, రోజూ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు పనిచేయాలి. దేశం కోసం కష్టపడి తీరాలంటుంది ప్రభుత్వం.

ఈ జనరేషన్ కి ఇది నచ్చడం లేదు. దాంతో సోషల్ మీడియా ద్వారా లయింగ్ ఫ్లాట్ ఉద్యమం ఊపందుకుంది. సహజం గానే బీజింగ్ పాలకులకు నచ్చలేదు. వెంటనే ఆ పోస్టులు తొలగించేలా సామాజిక మాధ్యమాలకు హెచ్చరికలు వెళ్లాయి. ఈ ఉద్యమం సిగ్గుచేటు అని ప్రభుత్వం పేర్కొనగా, మరలా పనిచేయడం కన్నా మనసుకు నచ్చింది చేయడమే మంచిదని యువతరం భావిస్తోంది.

ఏదేమైనా చైనాలో ఇదొక ముఖ్య మైన మార్పు అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఇప్పటికి సద్దు మణిగినట్టు కనిపించినా గతంలో మాదిరి అణచివేత అంత సులభం కాదంటున్నారు. మరిక చైనా యువత వెల్లకిలా పడుకుంటారో, బోర్లా పాకుతూ పనిచేస్తారో కాలమే చెప్పాలి.

-కె. శోభ

Read More: రాశి తగ్గి వాసి పెరిగిన పెళ్లిళ్లు

Read More: ఈ బామ్మ చాలా ఫిట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్