ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు మూడు రాష్ట్రాలను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. త్రిపుర నాగాలాండ్లో ఇప్పటికే బీజేపీ కూటముల విజయం ఖాయం అయింది. కాన్రాడ్ సంగ్మాతో పొత్తును పునరుద్ధరిస్తూ మేఘాలయలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యాయి. దీంతో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటు కానున్నాయి. మూడు బీజేపీ ఖాతాలోనే పడ్డాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం
ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మేఘాలయలో సంకీర్ణం ఏర్పడనుండగా, బీజేపీ కీలకపాత్ర పోషించనుంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సభలో మోదీ మాట్లాడుతూ…. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎంతో ప్రేమను చూపించారని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. విజయం కంటే ప్రజలు చూపించే ప్రేమ ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో ఉన్న దృఢమైన విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీకి దూరంగా ఉండొచ్చేమో కానీ, తన హృదయానికి మాత్రం దగ్గరగానే ఉంటాయని మోదీ వ్యాఖ్యానించారు. ఇక, ఓటమిని తట్టుకోలేని కొందరు ఈవీఎంలను తప్పుబడుతున్నారని విమర్శించారు.