Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ ( Hon Hai Fox Conn) సంస్థ ఛైర్మన్ యంగ్ ల్యూ ( Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారితో ప్రగతి భవన్ లో గురువారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా Hon Hai Fox Conn సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి లభ్యం కానున్నది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది.

యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా ఇదే రోజుకూడా కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సిఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ ల్యూకి అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం..ప్రగతి భవన్ లో యంగ్ ల్యూ ప్రతినిధి బృంధానికి సిఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనంతో ఆతిథ్యమిచ్చారు.

అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ తమ ఉత్పత్తి కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్రాన్ని గమ్యస్థానం గా ఎంచుకోవడం పట్ల ఆ సంస్థకు సిఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫాక్స్ కాన్ సంస్థ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల పైన కూలంకషంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సిఎం కేసీఆర్ ఈ సందర్భంగా చైర్మన్ యంగ్ ల్యూ కి హామీ ఇచ్చారు.

తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడును రప్పించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని సిఎం అన్నారు. రాష్ట్రంలో ‘ఫాక్స్ కాన్ ’ భారీ పెట్టుబడి పెట్టడంతోపాటు గతంలో లేని విధంగా లక్ష కు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయం అన్నారు. ఈ లక్ష ఉద్యోగాలను సాధ్యమైనంతవరకు స్థానిక తెలంగాణ యువతకు దక్కేలా చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ తెలిపారు.

“తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నది. బంగారు తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం అనేక గొప్ప గొప్ప ప్రాజెక్టులను చేపట్టింది. ఫాక్స్ కాన్ సంస్థ తమ యూనిట్ ను రాష్ట్రంలో నెలకొల్పడం పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. తైవాన్‌ను తెలంగాణ సహజ భాగస్వామిగా భావిస్తున్నాం. ఫాక్స్ కాన్ పురోగమనంలో తెలంగాణ రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉంది” అని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రతిపాదిత యూనిట్ తో రాబోయే 10 సంవత్సరాల కాలంలో 1,00,000 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందే అవకాశముండటం పట్ల ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందన్నారు. ఇక్కడి పారిశ్రామిక అనుకూల వాతావరణం పైన ఫాక్స్ కాన్ చైర్మన్ ప్రశంసలు కురిపించారు. ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా ఐటి, అనుబంధ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన అభివృద్ధి పైన ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ సంస్థ పెట్టుబడుల విషయంలో ఆశావాహ దృక్పథంతో ఉన్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కెటి రామారావు, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపీ అంజనీ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com