గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు 340 ప్రతిపాదనలు వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 20 రంగాల్లో వస్తోన్న పెట్టుబడుల ద్వారా 6 లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. నేడు 92 ఎంవోయులు చేసుకుంటున్నామని, 11.85 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 4 లక్షల మందికి ఉపాధి కలగాబోతోందని వివరించారు. మిగిలిన 248 ఒప్పందాలు రేపు ఎంవోయూ చేసుకుంటామని, 1.15 లక్షల కోట్ల పెట్టుబడులతో 2 లక్షల మందికి ఉపాధి కలుగుతోందని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ప్రారంభ సెషన్ లో సిఎం జగన్ ప్రసంగించారు. అందమైన విశాఖ నగరంలో ఈ సదస్సు నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందని, దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా ఈ నగరం భాసిల్లుతోందని చెప్పారు. విశాఖపట్నం త్వరలోనే ఏపీకి పరిపాలనా రాజధాని కాబోతోందని, కొద్దిరోజుల్లో తాను కూడా ఇక్కడకు మకాం మారుస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక దిగ్గజాలకు సిఎం జగన్ హృదయపూర్వక స్వాగతం పలికారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో….వన్ ఎర్త్- వన్ ఫ్యామిలీ- వన్ ఫ్యూచర్ నినాదంతో సెప్టెంబర్ లో జి 20 సదస్సు నిర్వహించుకుంటున్నామని, ఇది భారతీయులకు ఎంతో గర్వకారణమైన అంశమని, దీనిలో భాగంగా జి 20 వర్కింగ్ గ్రూప్ ఒక సమావేశం విశాఖలో జరుగుతోందని చెప్పారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్ధిక వ్యవస్థగా ఇండియా ఉందని, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోందని చెప్పారు. ఈ ఆర్ధికాభివృద్ధి పథంలో ఆంధ్ర ప్రదేశ్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. సహజ సిద్ధ వనరులతో, ఖనిజాలు, 974 కిలోమీటర్ల తీర ప్రాంతంతో, మానవ వనరులతో ఆంధ్ర ప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమని వివరించారు. పారిశ్రామిక వేత్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఒక్క ఫోన్ కాల్ తో స్పందిస్తామని హామీ ఇచ్చారు.