లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరమని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుందని ఈ రోజు హైదరాబాద్ లో విమర్శించారు.
వైఎస్ షర్మిల విమర్శలు ఆమె మాటల్లోనే…
రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు, మహిళలకు 33% సీట్లు ఎందుకు కేటాయించలేదు? 2014 ఎన్నికల్లో మహిళలకు ఇచ్చింది 6 సీట్లు అంటే 5.88%.. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం? 2018లో మహిళలకు 4 సీట్లు అంటే 3.36% ఇదేనా మహిళలకు మీరిచ్చే మర్యాదా? శాసనమండలిలో 34 మంది సభ్యులకు మీరు మహిళలకు ఇచ్చింది మూడు సీట్లు.. అంటే 8.82%. ఇదేనా మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి? 17 పార్లమెంట్ స్థానాలకు మహిళలకు రెండు సీట్లు.. అంటే 11.76%.. ఇదేనా మహిళలపై మీకున్న ప్రేమ?
తెలంగాణ తొలి క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదు. ఇప్పుడున్న క్యాబినెట్ లో పట్టుమని ఇద్దరు మంత్రులు. ఇదేనా మహిళలపై మీకున్న మక్కువ? మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో మీ తండ్రి గారికి వచ్చిన అడ్డంకి ఏంటి? మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు.