రాజ్‌భవన్‌ను సందర్శించేందుకు సీఎస్ దగ్గర సమయం లేదా? అని నిలదీశారు గవర్నర్ తమిళిసై. కనీస మర్యాదగా ఫోన్‌లో కూడా మాట్లాడలేదని… మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్‌భవనే దగ్గరన్నారు తమిళిసై. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తాజాగా దీనిపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గవర్నర్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శాంతికుమారి రాజ్‌భవన్‌కు రాలేదని.. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ను సందర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర సమయం లేదా అని పరోక్షంగా శాంతికుమారిని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం సీఎస్ వ్యవహరించలేదని, కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదని తమిళిసై తెలిపారు. ఇక చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేసిన గవర్నర్.. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై పరోక్ష విమర్శలు చేయడం గమనార్హం.