తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లీయూ లేఖ రాశారు. తాను హైదరాబాద్‌లో పర్యటించిన కేసీఆర్ ఇచ్చిన అతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు భారతదేశంలో ఇప్పుడు కొత్త స్నేహితుడు ఉన్నాడని.. కేసీఆర్‌ను తైవాన్‌కు ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపారు. కేసీఆర్ తన పర్సనల్ గెస్ట్ అని పేర్కొన్నారు. ఇటీవల సమావేశంలో చర్చించినట్టుగానే కొంగర కలాన్‌లో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఫాక్స్ కాన్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొంగర కలాన్‌లో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా ధ్రువీకరించారు.
గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి..,
గౌరవ ముఖ్యమంత్రి గారు,
హైదరాబాద్ పర్యటన సందర్భంగా నాకు, నా బృందానికి మీరిచ్చిన ఆతిథ్యానికి ముందుగా, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. హైదరాబాద్ లో మీము అద్భుతమైన సమయాన్ని గడిపాము. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ మీరు స్వదస్తూరితో రాసి గ్రీటింగ్ కార్డు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ పరిణామం, అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి, మీ దార్శనికత నాలో స్ఫూర్తిని నింపింది. భారత దేశంలో నాకో కొత్త మిత్రుడు లభించాడు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను.
మార్చి 2 వ తేదీన మీతో సమావేశం సందర్భంగా చర్చించినట్టు, త్వరలోనే కొంగర కలాన్ లో మా సంస్థ ఉత్పత్తులను ప్రారంభించడానికి ఫాక్స్ కాన్ కట్టుబడి వుంది. ఈ దిశగా మీము చేపట్టబోయే కార్యాచరణలో మీరు సంపూర్ణ మద్దతు నివ్వాలని కోరుతున్నాను.
మీరు నా అతిథిగా తైవాన్ కు రావాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తైపీ’ లో మీకు ఆతిథ్యమివ్వడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. త్వరలోనే మీతో మరోసారి సమావేశానికి ఎదురుచూస్తూ..
భవదీయ
యంగ్ ల్యూ
చైర్మన్
హోన్ హై ప్రిసిషన్ ఇండస్ట్రీ కం.లి.( ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్)