దిల్ రాజు నిర్మించిన చిన్న సినిమా ‘బలగం‘. ప్రియదర్శి, కావ్యా జంటగా నటించారు. ఈ సినిమా ద్వారా కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలంగాణ నేపధ్యంలో రూపొందిన బలగం చిత్రం ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న బలగం చిత్రయూనిట్ ను 54 ఏళ్ల చరిత్ర గలిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అభినందించి సత్కరించింది. ప్రసాద్ ల్యాబ్స్ లో సందడిగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ… ఈ సినిమా ఖచ్చితంగా జనాదరణ పొందుతుందని నాకు ముందు నుంచి నమ్మకం ఉంది. అయితే.. ఒకానొక సమయంలో ఓటిటిలో రిలీజ్ చేద్దామా అని కూడా అనుకున్నాం. అయితే.. మా టీమ్ అందరూ థియేటర్లోనే రిలీజ్ చేయాలి అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించే సినిమా ఇది. ఫస్ట్ డే కంటే సెకండ్ డే.. థర్డ్ డే.. ఇలా రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మా టీమ్ ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ… 54 సంవత్సరాల క్రితం ఏర్పడిన ప్రఖ్యాత సంస్థ అయిన ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌కు నేను రెండోసారి అధ్యక్షుడిగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ఈ అసోసియేషన్ అభినందన సభలు ఏర్పాటు చేయడం ఒక రిపోర్టర్‌గా నేను చూశాను. ఈ ‘బలగం’ సినిమా విషయానికి వస్తే.. మంచి కంటెంట్.. ఉన్న సినిమా ఇది. మొట్ట మొదటి సారిగా దిల్ రాజు గారు ఆయన పేరుతో దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానర్‌ను స్థాపించి.. అంతా కొత్త వారితో సినిమా చేస్తున్నారు అంటే.. ఏదో విషయం లేకుండా చేయరు అనుకున్నాను. దర్శకుడు వేణు నాకు మంచి మిత్రుడు. తెలుగు సినిమా పరిశ్రమకు దిల్ రాజు గారు ఒక బలం.. ఆయన వెనుక ఎంతో బలగం ఉంది. ఈ బ్యానర్‌లో ఇలాంటి మంచి సినిమాలు సంవత్సరానికి ఒకటన్నా తీయాలని కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ… సినిమా చూస్తుంటే.. మా ఇంట్లో నా చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. ఇలాంటి మంచి సినిమా తీసిన నిర్మాత దిల్ రాజు గారికి, యూనిట్ అందరికీ హృదయ పూర్వక అభినందనలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ హేమ సుందర్, సురేష్ కవిరాయిని, ఆర్.డి.ఎస్ ప్రకాష్, అబ్థుల్, ధీరజ అప్పాజీ, వీర్ని శ్రీనివాసరావు, చందు రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : సహజత్వానికి దగ్గరగా నడిచిన పల్లెటూరి జీవనచిత్రం బలగం