ప్రజల ఆలోచనలను, ఆశయాలను తన లక్ష్యాలుగా మలచుకున్న నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పార్టీని స్థాపించిన తరువాత 12 ఏళ్ళపాటు, అంతకుముందు మూడేళ్ళు జగన్ ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నారని కొనియాడారు. నాయకుడంటే ఎలా ఉండాలో జగన్ చూపించారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అదే అజెండాగా నేతలు పనిచేస్తే అలంటి నేతకు ఎలా అండగా ఉంటారో ప్రజలు గత ఎన్నికల్లో నిరూపించారని, వారి ఆశీస్సులు అందిస్తూ వచ్చారని చెప్పారు. పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ…తన పాలన ద్వారా ప్రజల్లో విశ్వాసం మరింతగా పెంచుకోగాలిగారని సజ్జల చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం వరకూ అమలు చేశామని, చెప్పనివి కూడా ఎన్నో చేశామని తెలిపారు. విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయగలిగామన్నారు. ప్రతి కుటుంబ తన కుటుంబంగా భావించి అందరికీ న్యాయం చేస్తున్నారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థతో పాలనలో గొప్ప మార్పులు తీసుకు వచ్చామని… ఇవి తమ ఘనకార్యాలుగా తాము చెప్పుకోవడం లేదని, బాధ్యతగా ఈ పనులన్నీ చేశామని వివరించారు. ప్రాజెక్టులు పూర్తవుతాయని, రైతాంగానికి మరింతగా మేలు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలకుడు ఎలా ఉండాలో చూడాలంటే జగన్ పాలన; ఎలా ఉండకూడతో చెప్పాలంటే గత బాబు పాలన చూస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. జగన్ పాలన రోల్ మోడల్ గా నిలిచిందని, మన పథకాలు ఇతర రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వారి మధ్య వైషమ్యాలు సృష్టించడం, సంఘాల మధ్య విభేదాలు తీసుకురావటం తాము చేయడంలేదని…. ప్రభుత్వంలో వారు ఓ భాగమని స్పష్టం చేశారు. కుటుంబంలో సమస్యలుగా వారి ఇబ్బందులను భావించి వాటి పరిష్కారానికి కృషిచేస్తున్నామని తెలిపారు.