ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు నేడు మొదలయ్యాయి. తన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ అసమ్మతి నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సభలో ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మైక్ ఇచ్చే వరకూ నిలబడే ఉంటానని పట్టుబట్టారు. ఏవైనా సమస్యలు ఉంటే తన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. కానీ కోటంరెడ్డి పట్టు వీడక పోవడంతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అంబటి రాంబాబు జోక్యం చేసుకొని శ్రీధర్ రెడ్డి విపక్ష టిడిపి సభ్యులతో కలిసి సభలో గలాటా సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ఇది సరైంది కాదని హితవు పలికారు.
శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని అంబటి అభివర్ణించారు. ఆయనపై టిడిపికి పొద్దున్న లేచే సరికి ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. నమ్మక ద్రోహం చేసి ఇవాళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలాంటి నేతలకు పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే కోటంరెడ్డిపై చర్య తీసుకొని అయినా సభ కొనసాగించాలని అంబటి ప్రతిపాదించారు. స్పీకర్ విజ్ఞప్తి మేరకు కోటంరెడ్డి ఆందోళన వీడడంతో సభ కొనసాగింది.
తన నియోజకవర్గ సమస్యలపై ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నానని, ప్లే కార్డుల ద్వారా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడం సభ్యుడిగా తన హక్కు అని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.