వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా తాము గెలవబోతున్నామని, ఈ విషయాన్ని రాసి పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్ర ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ఉంటూ వస్తోంది, ఒకట్రెండు సార్లు తప్ప మిగిలిన అన్ని సార్లూ తామే గెల్చుకున్నామని, మరోసారి ఈ శాసనమండలి ఎన్నికల ద్వారా ఈ విషయం నిరూపితమైందని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజల భావన వ్యక్తమవుతుందని ఈ విషయాన్ని వైసీపీ నేతలే ఒప్పుకుంటున్నారని అన్నారు. అభివృద్ధే తమ నినాదమని ఉత్తరాంధ్ర ప్రజలు చాటి చెప్పారన్నారు. ప్రజలు తిరగబడితే ఫలితం ఏ విధంగా ఉంటుందో ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని చెప్పారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో పన్నుల భారం అధికంగా ఉందని, దేశంలోనే ధరల్లో ఏపీ నంబర్ 1 గా నిలిచిందని, దీనిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామంటూ టిడిపి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ర్యాలీగా వెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అచ్చెన్నాయుడు స్పందించారు.
రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని, పులివెందుల సహా అన్ని స్థానాల్లో విజయం తమదేనని చెప్పారు. ఓటర్లు విజ్ఞులు అని, వారు అన్నీ ఆలోచించి ఓట్లేస్తారని… డబ్బు, అధికారం పనిచేయవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : టిడిపి వెంట గ్రాడ్యుయేట్లు, వైసీపీని గెలిపించిన టీచర్లు