Friday, November 22, 2024
Homeజాతీయందేశ ఆర్థికంలో మహిళల పాత్ర

దేశ ఆర్థికంలో మహిళల పాత్ర

ఆడవాళ్లు డబ్బులు ఎక్కడ దాచుకోవాలి. పోపుల డబ్బాలు, చీరమడతలేనా? అదీ ఎవరికంటా పడకుండా. ఒకప్పుడైతే ఇంతే. క్రమేణా పరిస్థితి మారింది. గ్రామీణ, నిరుపేద మహిళలకూ డ్వాక్రా వంటి పథకాలు పొదుపు, మదుపు నేర్పాయి. మెల్లగా వారికి బ్యాంకు ఖాతాలు మొదలయ్యాయి. కానీ లావాదేవీలు ఎలా చెయ్యాలో తెలీక అక్కడే ఆగిపోతున్నారు.

అరచేతిలో ఉన్న ఫోన్ అన్ని లావాదేవీలూ చేసే కాలమిది. ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ ట్రాన్స్ఫర్, జి పే, రు పే అంటూ ప్రభుత్వాలే డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహిస్తున్న వైనం. మహిళలకు అన్ని అవకాశాలూ లభిస్తున్నాయంటున్నాం. కానీ ప్రతిపనికీ ఇతరులపై ఆధారపడే అవకాశం ఉండీ ఏమి లాభం అని మహిళల ప్రశ్న. వాళ్ళని, వీళ్ళని పట్టుకుని బ్యాంకులో డబ్బు దాచుకుంటే తర్వాత ఉపయోగించుకునే విధానాలు తెలియలికదా అంటున్నారు. దేశం లోని ప్రముఖ మహిళా ఆర్థికవేత్తలు కూడా ఇదే విషయం నొక్కి చెప్తున్నారు.

స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ రుణాల ద్వారా ఎంతో మంది మహిళలు కొంతవరకు ఆర్థిక వ్యవహారాలు నేర్చుకున్నారు. అయితే వీరి పేరిట భూములు, ఇళ్లు ఉండవు. దాంతో రుణాలకు హామీ కోసం భర్తలపైనే ఆధారపడాలి. అది సులభం కాదు. దాంతో చాలామంది పట్టణ, గ్రామీణ పేద మహిళలు ఏమీ చేయలేకపోతున్నారు. మరోపక్క వీరికి రుణాలు ఇచ్చే బ్యాంకులు, ఇతర సంస్థల్లో ఎక్కువగా అధికారం మగవారిదే. దాంతో సహేతుకంగా విచారించి రుణం మంజూరు చేయడం ఇబ్బందిగా ఉంటోందని ఆర్థిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఒక పక్క మహిళలకు ఆర్థికాంశాలపై అవగాహన కలిగిస్తూనే అందుకు ఆయా సంస్థల్లో మహిళా అధికారులను మరింతగా నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయని, దేశ ఆర్థిక పురోగతికి సహాయపడుతుందని నిపుణుల సలహా.

మహిళల వద్ద ధనం ఉంటే ఏమవుతుంది? పిల్లల చదువులకు, ఇంటి అవసరాలకు పనికొస్తుంది. ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు. ప్రతి పైసా కుటుంబ అభివృద్ధికే ఉపయోగపడుతుంది. ముందుచూపుతో వారు చేసే మదుపు ఆర్థిక వ్యవస్థకూ మేలు చేస్తుంది. అందుకే అన్నిరకాలుగా మహిళల ఆర్థిక అక్షరాస్యత అవసరం. కొన్ని రుణ సంస్థలు కొంత శాతం మహిళలకూ ఉద్యోగాలు కల్పించి అవగాహన పెంచేందుకు కృషి చేసినా, కరోనా వల్ల వారిలో చాలా మంది ఇంటికే పరిమితమై ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ తిరిగి మగవారిపైనే ఆధార పడుతున్నారని పరిశీలనలో వెల్లడైంది. మన దేశ ఆర్థిక మంత్రిగా మహిళ పనిచేస్తున్నపుడైనా మార్పు ఆశిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరచి విధాన నిర్ణయాల్లో, నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తేనే ఆశించిన ఫలితం.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్