నేడు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒకరోజు పాటు శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యం చేసుకుని దేశ చరిత్రలో ఇంతవరకూ ఒక ముఖ్యమంత్రి పర్యటన మీద వాయిదా తీర్మానం ఇచ్చిన సందర్భమే లేదని… తెలుగుదేశం సభ్యుల విజ్ఞత, జ్ఞానం ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ సభకు వచ్చి సస్పెండ్ చేయించుకొని బైటకు వెళ్ళడం టిడిపి సభ్యులకు అలవాటుగా మారిందని, విశ్రాంతి తీసుకొని సాయంత్రం మీడియా ముందుకు వస్తారంటూ ఎదురుదాడి చేశారు. రాష్ట్ర సమస్యలు, విభజన అంశాలపై కేంద్రాన్ని అడిగేందుకే సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళారని బుగ్గన వెల్లడించారు. టిడిపి సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి కాగితాలు చించి విసిరేశారు.
సభ్యులు తమ సీట్లో కూర్చోవాలని స్పీకర్ పదే పదే నచ్చజెప్పినా వారు వినకపోవడంతో ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీనితో టిడిపి ఎమ్మెల్యేలు బైటకు వెళ్ళిపోయారు.