అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు కాబట్టే ఆయన ఏం సాధించడానికి ఢిల్లీ వెళ్లారో చెప్పాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సిఎం జగన్ నిజంగా రాష్ట్రం కోసం, ప్రజలకోసం ఢిల్లీవెళ్తే, ఆ విషయం చెప్పడానికి బుగ్గనకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. సస్పెన్షన్ తరువాత టిడిపి ఎమ్మెల్యేలతో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
నిన్న ప్రభుత్వం విడుదలచేసిన పత్రికా ప్రకటన గమనిస్తే, జగన్ 18 సార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు ఏం చెప్పారో ఇప్పుడూ అదే చెప్పారని, ఒక్క అక్షరం కూడా మారలేదని ఎద్దేవా చేశారు. ఆ ప్రెస్ నోట్ లో మారింది తేదీలు, సమయం మాత్రమేనని విమర్శించారు. వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ ని కాపాడటానికే నిన్న ప్రధానమంత్రిని జగన్ కలిశారని ప్రజలంతా అనుకుంటున్నారని, ప్రభుత్వం దీనికి సాధాణం చెప్పాలని డిమాండ్ చేశారు.
“తన ఢిల్లీపర్యటన ఎందుకోసమో, ఏంసాధించడానికో ముఖ్యమంత్రి తక్షణమే సభలో ప్రకటనచేయాలి. అమరావతి నిర్మాణానికి నిధులుసాధించడానికి వెళ్లాడా ..లేక పోలవరం పనులుపూర్తిచేయడానికి సహకరించమని కోరడానికి వెళ్లాడా… వెనుకబడి న జిల్లాలకు నిధులుఅడగడానికి వెళ్లాడా..ఎందుకువెళ్లాడో చెప్పాల్సిందే” అంటూ అచ్చెన్నాయుడు సవాల్ నిలదీశారు.