తాను బలహీన వర్గాలకు చెందినవాడినే కానీ, బలహీనుణ్ణి మాత్రం కాదని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు తాము ఏమిటో రుజువు చేసుకుంటామన్నారు. తన సమర్ధత గుర్తించే సిఎం జగన్ స్పీకర్ గా అవకాశం ఇచ్చారన్నారు. నేడు అసెంబ్లీలో జరిగిన సంఘటనపై తమ్మినేని ఆవేదన వెలిబుచ్చారు. టిడిపి సభ్యులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత పార్లమెంటరీ వ్యవస్థలో గొప్ప సంప్రదాయాలు ఉన్నాయని, స్పీకర్ కు అపరిమిత అధికారాలు ఉన్నా, సభ ఆమోదంతోనే వాటిని తీసుకుంటారని గుర్తు చేశారు. పోడియం దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ అవుతారనే నిబంధన ఉందని, ఆ నిబంధనను ఇకపై కతినంగా అమలు చేశామని తమ్మినేని రూలింగ్ ఇచ్చారు.
సభలో నిరసన తెలిపే హక్కు ఉంటుందని, కానీ స్పీకర్ పట్ల అగౌరవంగా, అమర్యాదగా ప్రవర్తించడం సరికాదన్నారు. నేడు జరిగిన ఘటనను ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ చెబుతూ ఓ గొప్ప మానవతా వాది సిఎం జగన్ నాయకత్వం వహిస్తున్న ఈ సభలో ఆయా వర్గాల పట్ల వివక్ష మనం ఎప్పుడైనా చూశామా అని ప్రశించారు. కానీ ఓ ఎస్సీ ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకొని సభలో గొడవ చేయించి తద్వారా ఆ వర్గాలను ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పుకోవాలని చూస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే డిబివి స్వామిని ఉద్దేశించి స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.