నాగార్జున ఇటీవల నటించిన యాక్షన్ చిత్రాలు వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన బంగార్రాజు మాత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. దీంతో యాక్షన్ మూవీస్ కాకుండా.. ఫ్యామిలీ అంతా చూసే సినిమా చేయాలని నాగ్ డిసైడ్ అయ్యారు. రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. బెజవాడ ప్రసన్నకుమార్ మలయాళంలో విజయం సాధించిన ఓ సినిమా రీమేక్ హక్కులను అభిషేక్ అగర్వాల్ తో గతంలో కొనిపించారు.
ఈ కథ నాగార్జునకు అయితే.. బాగుంటుందని చెప్పడం.. ఈ సినిమా చూసి నాగ్ ఓకే అనడం జరిగింది. అయితే… ఈ చిత్రాన్ని చిట్టూరి శ్రీను నిర్మించాలి అనుకున్నారు. రీమేక్ రైట్స్ ను అభిషేక్ అగర్వాల్ ను అడిగితే.. తను ఈ రీమేక్ ను తెలుగులో తీయాలి అనుకుంటున్నానని.. రీమేక్ రైట్స్ ఇవ్వనని చెప్పారట. దీంతో బేరాలు నడిచాయి. చాలా మందితో చెప్పించారు. అయినప్పటికీ అభిషేక్ ఇవ్వను అనడంతో.. ఇక వేరే కథతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అభిషేక్ దిగి వచ్చి రీమేక్ రైట్స్ ఇస్తానని చెప్పడంతో నాగ్ – బెజవాడ ప్రసన్నకుమార్ మూవీకి అంతా క్లియర్ అయ్యిందని సమాచారం.
ఈ మూవీ రీమేక్ హక్కులను నిర్మాత చిట్టూరి శ్రీనుకు బదలాయించడానికి అభిషేక్ అగర్వాల్ సుమఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అగ్రిమెంట్స్ చేసుకోవాల్సి వుంది. ఇదిలా వుంటే.. సినిమాకు ఉగాది మర్నాడు ముహుర్తం చేసే ఆలోచన కూడా వుంది. నాగ్ సినిమా సెట్స్ పైకి వచ్చి ఎక్కువ రోజులే అయింది. ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ నుంచి షూటింగ్ కు వెళ్లే అవకాశం వుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాలనే పట్టుదలతో నాగార్జున ఈ సినిమా చేస్తున్నారు. మరి.. ఈ మూవీతో నాగ్ బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.