తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు పోరు బాట పట్టారు. ఎంతోకాలంగా విద్యుత్ సంస్థల్లో పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పీఆర్సీ(PRC) అమలుకు యజమాన్యాలు ముందుకు రాకపోవడంతో విద్యుత్ సంస్థల ఉద్యోగులు ఈ రోజు (శుక్రవారం) హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌద ముందు జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పదివేల మందికి పైగా తరలి వచ్చిన విద్యుత్ సంస్థ ఉద్యోగులు ఖైరతాబాద్ వద్ద జాతీయ రహదారి మొత్తాన్ని దిగ్భందించారు. దీంతో ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డికాపూల్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ధర్నాకు జేఏసీ చైర్మన్ పవర్‌ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు నాయకత్వం వహించారు. తమ ప్రధాన డిమాండ్లు అమలయ్యే వరకు ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతుందని ఆందోళన కారులు హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 24గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న తమకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ‘‘విద్యుత్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్థిల్లాలి, ఉయ్ వాంట్ జస్టీస్’’ అంటూ విద్యుత్ ఉద్యోగులు నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగులకు చెందిన 29 సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యంగా పీఆర్సీ ౩౦శాతం ఇవ్వాలని, 1999 నుంచి 2004 మధ్యలో నియమించబడిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మార్చాలని, ఆటిజన్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలన్న ప్రధాన డిమాండ్లతో ధర్నా నిర్వహించారు.