చంద్రబాబు స్క్రిప్తునే శ్రీదేవి నేడు చదివారని వైఎస్సార్ సీపీ నేత, బాపట్ల ఎంపి నందిగం సురేష్ విమర్శించారు. ఆమె ఎప్పటినుంచో ప్రిపేర్ గా ఉన్నట్లు మాట్లాడారన్నారు. ఆమె స్వయంగా ఒప్పుకున్నారని, ఎందుకు ఓటు వేయాల్సి వచ్చిందో చెప్పారన్నారు. ఆమె ఎమ్మెల్యేగా ఏనాడూ ప్రవర్తించలేదని, నియోజకవర్గానికి అందుబాటులో లేరని అన్నారు. రాజకీయాలు కొత్త కాబట్టి నేర్చుకుంటారులే అని సిఎం జగన్ ఉపేక్షిస్తూ వచ్చారని వెల్లడించారు. ఓటు అమ్ముకోకూడదని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడకూడదని డా. బి.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కూడా రాసిఉందని మరి శ్రీదేవి ఏం చేశారని ప్రశ్నించారు. ఆమె దళిత కార్డు వాడడం సరికాదన్నారు.
తప్పు ఎవరు చేసినా, ఏ స్థానంలో ఉన్నవారు చేసినా ఒకటేనన్నారు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎవరైనా ఇలాగే ఉంటుందన్నారు. రిటర్న్ గిఫ్ట్ లు ఇవ్వడం ఎవరివల్లా కాదని, సిఎం జగనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారన్నారు. శ్రీదేవి తప్పు చేసి దాన్ని అమరావతికి అంతగట్టడం భావ్యం కాదన్నారు. ఆమె ఏనాడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని విమర్శించారు. గతంలో ఆమెను మేకప్ కిట్ అని, ప్యాకప్ అంటూ విమర్శలు చేసింది టిడిపి నేతలు కాదా అని నిలదీశారు. ఆమె రాజకీయ జీవితానికి ఆమే చరమగీతం పాడుకున్నారని ధ్వజమెత్తారు.
ఉండవల్లి శ్రీదేవి ఊసరవెల్లి శ్రీదేవిగా మారారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మొన్న ఓటింగ్ రోజున ఆమె ప్రవర్తన, నటన చూసినప్పుడు సినిమా హీరోయిన్ శ్రీదేవిని మరిపించిందని, ఎంతో బాగా నటించారని, అప్పుడే ఆమె హడావుడి చూసి అనుమానం కలిగిందని చెప్పారు. తన కూతురుని తీసుకొని అసెంబ్లీకి వచ్చిందని, సిఎం జగన్ తో ఫోటో కూడా దిగిందని గుర్తు చేశారు.