Tuesday, September 17, 2024
HomeTrending NewsKandhar Loha:కేసీఆర్ కు మరాఠా ప్రజల నీరాజనం

Kandhar Loha:కేసీఆర్ కు మరాఠా ప్రజల నీరాజనం

మహారాష్ట్రలో నిర్వహించిన రెండో బహిరంగ సభ విజయవంతమైంది. నాందేడ్ జిల్లా కాంధార్ లోహలో ఆదివారం జరిగిన బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సభా స్థలి జనసంద్రాన్ని తలపించింది. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహ పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను.. అక్కడి వారి మరాఠా భాషలో వీడియో డాక్యుమెంటరీల రూపంలో ప్రదర్శించారు.

బిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంధార్ లోహ ప్రాంత ప్రజలు నీరాజనాలు పలికారు. హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణానికి వెలుతున్న సిఎం కాన్వాయ్ కి మూడు కిలోమీటర్లు ప్రజలు భారీ సంఖ్యలో దారి పొడవునా నిలబడి అభివాదం చేస్తూ కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్ ఉన్న బస్ , కాన్వాయ్ పై దారి పొడవునా గులాబీ రంగు పేపర్లు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ బస్ లో నుండి ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అభివాదం చేస్తూ వెళ్ళారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ‘దేశ్ కీ నేతా కేసీఆర్ , అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలతో సభాస్థలి మార్మోగిపోయింది.

సభా వేదికకు చేరుకున్న సీఎం కేసీఆర్, వేదికమీద ఏర్పాటు చేసిన మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, బసవేశ్వరుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అన్నా బాహు సాతే, మహాత్మా ఫూలే, అహిల్యాబాయి హోల్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కేసీఆర్ రైతుల గురించి మాట్లాడినప్పుడు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. జై బిఆర్ఎస్ – జై కిసాన్ నినాదాలతో సభా స్థలి ప్రతిధ్వనించింది. రైతన్నలు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలతో హోరెత్తిస్తూ… బిఆర్ఎస్ తోనే ‘రైతు రాజ్యం’ సాధ్యమంటూ ముక్తకంఠంతో నినదించారు.

ఈ సందర్భంగా బహిరంగ సభలో.. ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీలు, మధుసూదన చారి, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, షకీల్ అహ్మద్, బిఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్, బిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హిమాంశు తివారి, ఒడిషా బిఆర్ఎస్ నాయకుడు అక్షయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే దీపక్ అథ్రమ్, మాజీ ఎంపి హరిబన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ హెలిప్యాడ్ నుంచి తొలుత కాంధార్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోంగే ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించారు. నాందేడ్ జిల్లా బిఆర్ఎస్ నాయకులు, మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం కొబ్బరి కుడుకల భారీ గజమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు.

Also Read : Kandhar Loha:మహారాష్ట్రలో రైతుబందు తీసుకొస్తాం – కెసిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్