Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచావుకు చచ్చే చావొచ్చింది

చావుకు చచ్చే చావొచ్చింది

Alive forever:

“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి”

పుట్టిన వారికి మరణం తప్పదు. మరణించినవారికి మళ్లీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం దిగులుపడవద్దు.

భగవద్గీతలో ఈ శ్లోకం చాలా ఫేమస్. చావు పందిట్లో సౌండ్ బాక్స్ లో ఘంటసాల పాడిన భగవద్గీతను మొదట ఎవరు వాడారోకానీ, ఆ క్షణం నుండి భగవద్గీత ఆత్మలకు, అంతరాత్మలకు, దశదిన కర్మలకు, శవ యాత్రలకు, సంతాప సభకు, సామూహిక శోక సభలకు మాత్రమే పరిమితమైపోయింది. అర్జున విషాదయోగం అని ఒక అధ్యాయానికి పేరు ఉండడంతో భగవద్గీత విషాదానికి సంకేతంగా మరికొందరు భావించారు. నిజానికి మొత్తం భగవద్గీత కర్తవ్య బోధ. పనులు చేయకుండా తప్పించుకునే పలాయనవాదులకు కర్రుకాల్చి భగవంతుడు పెట్టిన వాత. ఎనభై ఏళ్లు దాటి కాటికి కాళ్లు చాచినవారికి తప్ప మిగతావారికి భగవద్గీత అంటరానిది కావడానికి రకరకాల కారణాలు. ఆ చర్చకు ఇది వేదిక కాదు.

అనాయాసేన మరణం;
వినా దైన్యేన జీవనం – అని సుఖమయిన చావు కోసం , ఒకరు జాలిపడేలా జీవితం ఉండకుండా ఉండడం కోసమే గుడికి వెళ్లినప్పుడు భగవంతుడిని ప్రార్థించాలని ఒక ప్రమాణం . ఇలా అడగడానికి మొదట ధైర్యం కావాలి ; తరువాత అమాయకత్వమో, అజ్ఞానమో ఉండాలి.

చావంటే భయం నటిస్తాం కానీ…నిజానికి మనకు చావంటే చాలా ఇష్టం.
కొంచెం పని పెరగగానే మనకు చచ్చేంత పనిగా మారిపోతుంది.
నిజానికి చచ్చేప్పుడు ఎవరూ పని పెట్టుకోరు – చచ్చే పని తప్ప.
ఏ మాత్రం ఇబ్బందిగా ఉన్నా చచ్చే చావొస్తుంది.
పసిపిల్లలు అల్లరి చేస్తుంటే చంపేస్తున్నార్రా అనకపోతే బతుకు సాగదు .
చచ్చేట్టు తిడితేనే తిట్టినట్లు.
కొందరు పెళ్ళిలో, చావులో మాత్రమే కలుస్తూ ఉంటారు.
శుభమా అని సుబ్బి పెళ్లి పీటలు ఎక్కితే ఆమె చావుకే వస్తుంది.
కొడితే చచ్చేట్టు కొట్టాలి. చావు కబురు ఎప్పుడూ చల్లగానే చెప్పాలి.

పెళ్ళికి చావుకు ఒకే మంత్రం ఎక్కడ చెబుతారోనని ఆందోళన.
రాచపీనుగ ఒంటరిగా వెళ్లలేక తోడుకోరుకున్నా మనం అర్థం చేసుకోగలం.
కోపమొస్తే చచ్చినా ఇక పగవాడి మొహం చూడం. పైగా వారికే చచ్చినా నీ గడప తొక్కను అని బతికితికున్న గర్వంతో చెప్పగలం.
చాలామంది మనల్ను రోజూ చంపుకు తింటున్నా ఎలాగో మళ్లీ మళ్లీ బతుకుతూ ఉంటాం.
బాగా కోపమొస్తే బతికి ఉన్న వారిని ఒరేయ్ పీనుగా! అంటూ చంపేస్తాం.
ఒట్టి పీనుగకు విలువ లేదనుకుంటే చవట పీనుగ, ముదనష్టపు పీనుగ అని విశేషణాలు జతచేస్తాం.
జాగారంలో శవజాగారం ఒకటి.
పీనుగ ఎదురొస్తే అదృష్టమే అదృష్టమట.

ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ చావు పాండిత్యం ఎందుకు?
ప్రాణం ఉంటే శివం – ప్రాణం లేకుంటే శవం.
మృతియె లేకున్న రుచి ఏది ఇలలోన? అన్నాడు దాశరథి .
స్వతంత్ర దేశంలో చావును పెళ్లిగా మలిచారు సినీ కవులు.
మరణాంతాని వైరాని – చచ్చాక పగలు ప్రతీకారాలు కూడా చచ్చి పోవాలి అని హితవు చెప్పాడు శ్రీరామచంద్రుడు.

Immortality

సమయం ఆసన్నమయినప్పుడు పండిన దోసకాయ తీగనుండి టక్కుమని తనకు తానుగా విడివడినట్టు బంధాలను తెంచుకుని మృత్యువులోకి వెళ్లాలంటుంది మృత్యుంజయ మంత్రం. చాలామంది చావును జయించడానికే ఈ మంత్రం అనుకుని చచ్చేట్టుగా చదువుతుంటారు. నిజానికి ఇది చావు భయాన్ని జయించే మంత్రం.

యముడు కలలో కూడా నిషిద్ధం. చావులేని జగతిని ఒక్క సారి ఊహించుకోండి. దుర్భరంగా ఉంటుంది. అసలు ఈ లోకం పేరే మర్త్య లోకం . వ్యాకరణం, అర్థం తెలియదు కాబట్టి ధైర్యంగా ఉంటాం. మృత్యువును వెంటబెట్టుకుని పుట్టే లోకాన్ని మర్త్య లోకం అంటారు.

అంతములేని ఈ భువనమంతయు – అంటూ ఎంతటివారయినా ఈ భూమి మీద పోవాల్సిందే అన్నాడు దువ్వూరి రామిరెడ్డి . భూమి ఒక బాట. పొద్దున, సాయంత్రం ఈ బాటకు అటు ఇటు తలుపులు. ఆ తలుపులో వచ్చి , ఈ తలుపుగుండా వెళ్లిపోవాల్సిన వాళ్లమే.

మరణానికి భయపడకుండా మరణాన్ని ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడారు సి నా రె.

Immortality

మరణం నా చివరి చరణం కాదన్నాడు అలిశెట్టి ప్రభాకర్.

“మృత్యువుకు నేనంటే భయం. నేనున్నప్పుడు అది నాముందుకు రాదు.
అది వచ్చినప్పుడు నేను ఉండనే ఉండను”- అని ఒక ధైర్యవంతుడు కొంటెగా అన్నా మృత్యువుకు లొంగిపోయేవాడినే అని చెప్పకనే చెప్పుకున్నాడు.

వాడుక మాటల్లో చావు గురించి ఎన్ని ఎగతాళి మాటలు ఎన్నయినా ఉండవచ్చు.
కానీ చావు ఎగతాళి కాదు.
చావు- చచ్చేంత సీరియస్.

అలాంటి చావుకు చచ్చే చావొచ్చిందిప్పుడు. 2030 తరువాత చావుకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పి…ఎప్పటికీ బతికి ఉండే అమరత్వం సాధ్యమని…గూగుల్ మాజీ ఇంజనీర్ రే కర్జ్ వెల్ చెబుతున్నాడు. చదరంగంలో మనుషులను ఓడించే కంప్యూటర్లు పుడతాయని ఈయన 35 ఏళ్ల కింద చెప్పినప్పుడు లోకం నవ్వుకుంది. హాస్యానికయినా ఒక హద్దుండాలని ఆయన్ను మందలించింది. అది నిజమయినప్పుడు లోకం ఆయన భవిష్య దృష్టికి వంగి సలాము చేసింది. ఇలాగే ఆయన చెప్పిన భవిష్య విషయాల్లో 86 శాతం నిజమై కూర్చోవడంతో …ఇప్పుడు మరణం లేని అమరత్వాన్ని కూడా లోకం సీరియస్ గా తీసుకుంటోంది.

సాధ్యాసాధ్యాలను కాసేపు పక్కన పెట్టి అమరత్వం నిజమయితే ఎలా ఉంటుందో సరదాగా ఆలోచిద్దాం.

  • ఏమి వదినా! మా ముని ముని ముని ముని ముని ముమ్ముని మనవడి పెళ్లిలో కలిశాము. నాలుగు వందల ఏళ్లయ్యింది…ఒక్కసారి కూడా మళ్లీ కనిపించలేదు?
  • అవునమ్మా! మేము అమెరికాలో సెటిలయి 399 ఏళ్లయ్యింది. మా ముని ముని ముని ముని ముమ్మనవరాలు పెంటపాడులో భరత నాట్యం అరంగ్రేటం చేస్తుందంటే వచ్చాము.
  • డాక్టరు గారూ! మొన్న మా ఇంటి పునాది రాయి నాతో పరాచికాలాడుతోంది. నేనూ వెయ్యేళ్ళుగా ఉన్నా…నువ్వూ వెయ్యేళ్లుగా నాలాగే బండరాయిలా పడి ఉన్నావు…తిండి దండగ…ఎందుకు?అని. ఇందులో ఏమన్నా నెగటివ్ మీనింగ్ ఉందా? ఆ రాయయినా ఇంకో వెయ్యేళ్లకు మట్టి రేణువు అవుతుంది…నేను ఈ మట్టిలో మట్టిగా ఎప్పటికీ కలవనా? చావు లేని బతుకు దుర్భరంగా ఉంది డాక్టరు గారూ! వెయ్యేళ్లలో ఏవేవి చూడకూడదో అవన్నీ చూశాను. ఇక చూడలేను. చూసి…తట్టుకోలేను. ఏదయినా చేసి…దయచేసి నన్ను చంపేయండి…తక్షణం చంపేయండి!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

గుండెపోట్లు అన్నిటికీ వ్యాక్సిన్ కారణమా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్