Friday, October 18, 2024
HomeTrending NewsCool Roof Policy: దేశంలోనే తొలిసారి.. కూల్‌ రూఫ్‌ పాలసీ

Cool Roof Policy: దేశంలోనే తొలిసారి.. కూల్‌ రూఫ్‌ పాలసీ

 గృహ నివాసాలపై వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గిం చి, చల్లదనాన్ని ప్రసాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కూల్‌ రూఫ్‌ పాలసీ’ని ప్రకటించింది. ఐదు సంవత్సరాల వ్యవధిలో 300 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూల్‌రూఫ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో ఐదేండ్ల అనంతరం ప్రతి ఏడాది 600 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఆదా కానుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావాన్ని ఇండ్లు, భవనాలు, కార్యాలయాలపై తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కూల్‌రూఫ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. కూల్‌రూఫ్‌ విధానంలో నిర్మించే పై కప్పుల వల్ల ఉష్ణోగ్రతల ప్రభావం 2.1 డిగ్రీల నుంచి 4.3 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తగ్గుతుంది. కూల్‌రూఫ్‌ నిర్మాణానికి మీటర్‌కు రూ.300 వరకు ఖర్చు కానుండగా.. ఆ మేరకు విద్యుత్తు బిల్లు తగ్గే అవకాశమున్నది. దీంతో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది.

నోడల్‌ ఏజెన్సీల నియామకం

కూల్‌ రూఫ్‌ పాలసీని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖలు పర్యవేక్షించనున్నాయి. ఈ పాలసీని అమలు చేయడానికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీలు నోడల్‌ ఏజేన్సీలుగా వ్యవహరించనున్నాయి. విద్యుత్తు, ఆర్‌ అండ్‌ బీ, గృహ నిర్మాణ శాఖ, పట్టణ స్థానిక సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల అసోసియేషన్‌లు, ఆస్కి, ట్రిపుల్‌ ఐటీ, నాచురల్‌ రిసోర్సెస్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఆర్‌డీసీ) తదితర సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. వీటిని టీఎస్‌బీపాస్‌ బృందం సమన్వయం చేస్తుంది. ఈ పాలసీపై విసృ్త స్థాయిలో ప్రచారం చేయడానికి ఎన్జీవోలు, రెసిడెంట్‌, కాలనీ, అపార్ట్‌మెంట్ల అసోసియేషన్‌లు, కమిటీలకు అవగాహన కల్పిస్తారు. ఈ పాలసీపై అవగాహన పెంచడానికి పట్టణాల్లో విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తారు. హోర్డింగ్‌లు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తారు. 

600 గజాల భవనాలకు తప్పనిసరి

600 గజాలపైన నిర్మించే భవనాల్లో కూల్‌ రూఫ్‌ పాలసీని తప్పనిసరిగా అమలు చేయాలి. 600 గజాలలోపు నిర్మించే ఇండ్లలోనూ ఈ విధానాన్ని అమలు చేసుకోవచ్చు. వీటికి ప్రోత్సాహకం అందించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకొనే సమయంలోనే కూల్‌ రూఫ్‌ను తప్పనిసరి చేశారు. కూల్‌ రూఫ్‌ను తనిఖీ చేసి అక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

ప్రభుత్వ, ప్రైవేటు భవనాలకు

ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, బిల్డర్లు నిర్మించే భవనాలు, విద్యాసంస్థలు, బస్‌ స్టేషన్‌లు, బస్‌ స్టాప్‌లు, కన్వెన్షన్‌ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, రిసార్ట్‌లు, దవాఖానలు, క్లినిక్‌లు తదితర భవనాలన్నీ ఈ పాలసీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం నిర్మించే డబుల్‌ బెడ్‌ ఇండ్లకూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఐటీ కార్యాలయ భవనాలు, సెజ్‌లు, రిటైల్‌ కాంప్లెక్స్‌లు, షాపులు, మాల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, పరిశ్రమల భవనాలు ఇలా అనేకం వీటి పరిధిలోకి వస్తాయి. వీటిల్లో తప్పనిసరిగా కూల్‌ రూఫ్‌ విధానం అమలు చేయాల్సి ఉంటుంది.

తక్కువ నిర్వహణ వ్యయం..

కూల్‌ రూఫ్‌ల నిర్వహణకు ఖర్చు చాలా తక్కువ. చదరపు మీటర్‌కు రూ.300 ఖర్చుతో కూల్‌ రూఫ్‌ వేసుకోవచ్చు. లేదా పైకప్పుపై కూల్‌ పెయింటింగ్‌ వేసుకోవచ్చు. 2017లో హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా కూల్‌ రూఫ్‌ విధానాన్ని అమలు చేశారు. పెయింట్‌ వేయడమే కాకుండా టైల్స్‌ వేయటం, మొక్కల పెంపకం చేపట్టవచ్చు. కూల్‌ రూఫ్‌ వల్ల సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకే పరావర్తనం చెందడం ద్వారా ఇంట్లోకి వేడి రావడం తగ్గుతుందని అంచనా. ఎండ తీవ్రత తగ్గడం వల్ల ఇంట్లో కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల వినియోగం తగ్గుతుంది. ఈ విధానాలు అంతర్జాతీయంగా కూడా ఆమోదం పొందాయి. ప్రపంచంలోని అనేక నగరాల్లో కూల్‌ రూఫ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.

300 చదరపు కిలోమీటర్లు లక్ష్యం

పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ. మొదటి రెండు స్థానాల్లో తమిళనాడు, కేరళ ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 47 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉండే పట్టణాల కోసమే కూల్‌రూఫ్‌ విధానాన్ని రూపొందించారు. కూల్‌ రూఫ్‌ పాలసీని 2028 నాటికి 300 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. హైదరాబాద్‌లో 200 చదరపు కిలోమీటర్లు, ఇతర ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్ల మేర కూల్‌ రూఫ్‌ను అమలు చేయనున్నారు. కూల్‌ రూఫ్‌ ద్వారా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించవచ్చు. ఇంటి పైన పెయింట్‌ కానీ టైల్స్‌ కానీ వేయడం ద్వారా, మొక్కలు పెంపకం ద్వారా ఇంట్లో వేడి తీవ్రత తగ్గుతుంది. దీని ద్వారా విద్యుత్తు వినియోగం తగ్గుతుంది.

Also Read : వైజాగ్ ఉక్కు- తెలుగు ప్రజల హక్కు: కేటిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్