Sunday, November 24, 2024
HomeTrending NewsVizag Steel: ప్రైవేటీకరణలో బాబుకు గోల్డ్ మెడల్: సజ్జల

Vizag Steel: ప్రైవేటీకరణలో బాబుకు గోల్డ్ మెడల్: సజ్జల

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సెంటిమెంట్, చరిత్రతో ముడిపడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇది మన ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని తెలిపారు. ఇలాంటి సీరియస్ అంశాన్ని తెలుగుదేశం, వామపక్ష పార్టీలు ఇంత నాన్-సీరియస్ గా డీల్ చేయడం సబబేనా అని ప్రశ్నించారు.  ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశమని, అయితే దీన్ని ప్రైవేటీకరించకుండా ఎలా చేయవచ్చనే దానిపై  సిఎం జగన్, తమ పార్టీ ఓ  స్పష్టమైన వైఖరితో ఉన్నామని చెప్పారు.

క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే ప్లాంట్ ను లాభాల బాటలోకి నడిపించవచ్చని జగన్ మొదటి నుంచీ చెబుతున్నారని, ఇదే అంశంపై కేంద్రానికి కూడా సూచించారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించాలని, ప్లాంట్ కు ఉన్న ఏడువేల ఎకరాల భూమిని అమ్మడం ద్వారా వచ్చే నిధులతో ప్లాంట్ వర్కింగ్ నిర్వహణ, ఆధునీకరణకు వినియోగించాలని చెప్పారని  సజ్జల వివరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెరమరుగు కాకూడదని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ మూడు అంశాలనూ ఆమోదించి తీరతారన్నారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో కేటిఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా కొనుగోలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని, అసలు కేంద్రం ప్రకటన ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)పరిమితంగా ఉందని చెప్పారు. కేవలం వయబిలిటీ కోసం వర్కింగ్ కాపిటల్ లో భాగం కావాలని  అడుగుతున్నారని, దీనికి బదులుగా స్టీల్ మెటీరియల్ ఇస్తామని పేర్కొన్నారని సజ్జల చెప్పారు. అందుకే  కేటిఆర్ కూడా ఆచి తూచి మాట్లాడినట్లు అనిపించిందని చెప్పారు.

వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే నేడు ఈనాడు పత్రికలో ‘ఉక్కు సంకల్పం’ పేరుతో వచ్చిన వార్తను చూస్తే గుండెలు పగిలేట్లు ఉందని సజ్జల ధ్వజమెత్తారు. కేవలం జగన్ ను అప్రదిష్ట పాలు జేయడానికి, వెంటనే చంద్రబాబును గద్దె ఎక్కించాలన్న తపన ఉందని విమర్శించారు.  పబ్లిక్  సెక్టార్ ను ప్రైవేట్ పరం చేయడంలో చంద్రబాబు ఛాంపియన్ గా నిలుస్తారని, దీనిలో ఒలింపిక్స్ పెడితే బాబుకు గోల్డ్ మెడల్ వస్తుందని సజ్జల ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణ విషయంలో ఎన్నోసార్లు చంద్రబాబు తన అభిప్రాయాలను ఎక్కడా దాచుకోలేదని, ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా ఎన్నో సంస్థలను అమ్మేశారని సజ్జల ఆరోపించారు. పొరపాటున 2004లో బాబు వచ్చి ఉంటే ఎక్కువ బాగం ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అయి ఉండేవన్నారు.  బాబు ప్రైవేట్ పరం చేయాలనుకున్న ఆర్టీసీని ప్రభుత్వపరం చేసిన ఘనత సిఎం జగన్ కే దక్కుతుందని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు ఒక సీటు కోసం బాబుకు వంత పాడుతున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వామపక్షాలకు ఏమాత్రం విలువ ఇచ్చాడో అందరికీ తెలుసనీ, అర్జెంటు గా బాబును అధికారంలోకి తీసుకు రావాలనుకున్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్