Sunday, November 3, 2024
HomeTrending NewsSatyagraha sabha: కెసిఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ - ఖర్గే

Satyagraha sabha: కెసిఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ – ఖర్గే

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పోరుయాత్రలో భాగంగా అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ సమీపంలో నిర్వహించిన సత్యాగ్రహ సభకు ఆయన ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన సాగిస్తున్నారని అది అంతం కావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కాఖర్గే అన్నారు. ప్రభుత్వం దేశ సంపదను అధానీలకు అంబానీలకు దోచి పెడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బంగారు తెలంగాణ పేరుతో కెసిఆర్ కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లక్షల కోట్లు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కెసిఆర్ కుటుంబానికి సాధ్యమైందని అన్నారు.

కొట్లాడి తీసుకున్న రాష్ట్రంలో ప్రజల బతుకులు బాగుపడలేదని పేర్కొన్నారు . ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది బలిదానాలు చేస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కెసిఆర్ కుటుంబం రాజ భోగాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీని పార్లమెంటు నుండి సస్పెండ్ చేయడం ఏమిటని, ఎక్కడో ఏదో మాట్లాడాడని కేసు పెట్టి అక్రమంగా ఆయనను పార్లమెంట్ కు దూరం చేశారని ఇదంతా కుట్రలో భాగమే అన్నారు.

అనంతరం పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత సేవల ప్రాజెక్టుకు అంబేద్కర్ సుజల స్రవంతి పేరు పెడితే దాన్ని తొలగించి నేడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం వెనుక మోసం ఉందని పేర్కొన్నారు. 9 ఏళ్ల నుంచి అంబేద్కర్ విగ్రహానికి సమయం సరిపోలేదని ఎన్నికల సంవత్సరంలో దళిత గిరిజనులు తగిన గుణపాఠం చెప్తారని లాగా మేక వన్నె పులిలాగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. ఇవాళ కెసిఆర్ కొడుకు, బిడ్డ మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఎవరిపైనా చర్య తీసుకోలేదని అదే దళిత మంత్రిపై ఆరోపణ ఇస్తే ఉన్నఫలంగా తొలగించారని దళితులంటే అంత చిన్నచూపు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ రోజు భారతదేశానికి సంబంధించినంత వరకూ పరమ పవిత్రమైన రోజు అంబేద్కర్ పుట్టిన రోజు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిస్తున్న నాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అని కొనియాడారు. నేడు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతోంటే వారి నాయకత్వంలో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపడ్డం కోసం జై భారత్ సత్యాగ్రహ సభలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సత్యాగ్రహ సభల ద్వారా తెచ్చుకున్న స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు మంచిర్యాల సభ దేశానికి దశ,దిశ నిర్దేశం చేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆదివాసీలకు, గిరిజనులకు, పోడు భూముల పట్టాలు ఇస్తాం.

ప్రాణహిత ప్రాజెక్టును బొందపెట్టి.. ఈ జిల్లా సస్యశ్యామలం కాకుండా చేసి, కాళేశ్వరం పేరుతో జిల్లాను ముంచుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ముంచాలని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేశామన్నారు. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

సత్యాగ్రహ సభకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ,కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , మధు యాష్కీ , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ,మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ,హన్మంతరావు , మాజీ డిప్యూటీ సీఎం రాజనర్సింహ, ములుగు ఎమ్మెల్యే సీతక్క , నాగం జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్