Wednesday, April 17, 2024
HomeTrending NewsKarnataka BJP: కర్నాటక బిజెపిలో ముసలం

Karnataka BJP: కర్నాటక బిజెపిలో ముసలం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే, ఇద్దరు బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీలతో సహా పలువురు నేతలు ఆ పార్టీని వీడగా.. తాజాగా బీజేపీ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవది కూడా కమలం పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ లక్ష్మణ్‌ సవదికి బీజేపీ టికెట్‌ దక్కలేదు. దీంతో ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు.

టికెట్ల నిరాకరణకు గురైన పలువురు నేతలు పార్టీని వీడటంపై ఇప్పటికే ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీని వీడే వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్‌లో చేరేముందు లక్ష్మణ్‌ సవది మీడియాతో మాట్లాడుతూ సర్దుకుపొయే రాజకీయాలు తనకు రావన్నారు. ‘బీజేపీతో ఇక చాలు. నేను చనిపోయిన తర్వాత కూడా నా మృతదేహాన్ని బీజేపీ ఆఫీస్‌ ముందుకు తీసుకోకూడదు’ అంటూ తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌వై గోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు పుట్టన్న, బాబూరావు బీజేపీకి గుడ్‌బై చెప్పారు. కాగా, లక్ష్మణ్‌ సవది బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌కు సన్నిహితుడు. యెడియూరప్పకు ప్రత్యామ్నాయ నేతగా లక్ష్మణ్‌ను సంతోష్‌ ప్రోత్సహించారనే చర్చ కర్ణాటక రాజకీయ వర్గాల్లో ఉన్నది.

బీజేపీ ఇప్పటికి రెండు విడతలుగా 212 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టికెట్ల నిరాకరణకు గురైన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నేతల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి నెలకొన్నది. దాదాపు 35 నుంచి 45 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు ఉన్నాయి. నేతల మద్దతుదారులు పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. పార్టీ తరపున ప్రచారం చేయబోనని టికెట్‌ లభించని మంత్రి ఎస్‌ అంగార తేల్చిచెప్పారు. పలుచోట్ల వందలాది మంది కార్యకర్తలు బీజేపీకి రాజీనామాలు చేస్తున్నారు. కొందరు శాసనసభ్యులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా మరి కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయాలనే యోచనలో ఉన్నారు. గూళిహట్టి శేఖర్‌(హోసదుర్గ) తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగనున్నట్టు ప్రకటించారు. కుమారస్వామి(మూడిగెరె) కూడా పార్టీకి దూరమయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్