సాయితేజ్ హీరోగా బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘విరూపాక్ష’ ఈ నెల 21వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉంటూ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి, ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ సినిమా, నిన్నరాత్రి ‘ఏలూరు’లో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ వెంటుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావడం విశేషం.
ఈ వెంటులో సాయితేజ్ మాట్లాడుతూ .. ముందుగా తనకి జరిగిన బైక్ ప్రమాదం గురించి ప్రస్తావించాడు. బైక్ అంటే తనకి ప్రాణమనీ, అలాంటి బైక్ పై తాను వెళుతుండగా పడిపోవడం జరిగిందని అన్నాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది తనకి తెలియదనీ, కొన్నిరోజుల తరువాత కళ్లు తెరిచిన తనకి, తన తల్లి .. తమ్ముడు ముందుగా కనిపించారని చెప్పాడు. వాళ్లతో మాట్లాడటానికి తాను ఎంతగా ప్రయత్నించినప్పటికీ, మాట రాలేదని అన్నాడు.
హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిన తరువాత కూడా ఎక్కువ సేపు నిలబడాలేకపోయేవాడినని చెప్పాడు. తాను ఏం చేశానని ఇలా జరిగిందనే ఆలోచన చేస్తూ బాధపడేవాడిననీ, దేవుడా ఏంటీ ఈ జీవితం అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయని అన్నాడు. తాను మళ్లీ మాట్లాడాలి .. ఎప్పటిలానే సినిమాలు చేయాలి .. అభిమానులను కలుసుకోవాలనే పట్టుదలను పెంచుకుంటూ వచ్చానని చెప్పాడు. ఆ పట్టుదలే మళ్లీ తనని ఈ స్థితికి తీసుకుని వచ్చిందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.