Saturday, July 27, 2024
HomeTrending NewsVidudala Movie Review: కథ అంటే ఇది .. కంటెంట్ అంటే ఇది!

Vidudala Movie Review: కథ అంటే ఇది .. కంటెంట్ అంటే ఇది!

ఏ సినిమాకైనా కథనే హీరో. అయితే చాలా కథలు హీరోల చుట్టూ అల్లబడుతూ ఉంటాయి. మరొకొన్ని కథల్లో ఆ కథలో ప్రధానమైన పాత్రనే కథానాయకుడిగా కనిపిస్తూ ఉంటుంది. కథ బాగుంటే స్టార్ డమ్ దానికి కొంతవరకూ ఉపయోగపడుతుంది. ఇక కొన్ని కథలు అసలు స్టార్ డమ్ పని లేకుండానే ప్రేక్షకులను పొలోమని థియేటర్లకు రప్పిస్తూ ఉంటాయి. కంటెంట్ బాగుంటే అది ఏ భాషా చిత్రం? ఆర్టిస్టులు ఎవరు? అనేది కూడా ఆడియన్స్ పట్టించుకోరు.

అలా ఇటీవల వచ్చిన సినిమానే ‘విడుదల’. తమిళంలో మార్చి 31వ తేదీన విడుదలైన ఈ సినిమా, అక్కడ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ 15వ తేదీనే ఇక్కడి థియేటర్లకు వచ్చింది. చిన్నచిన్న పాత్రలను పక్కన పెట్టేస్తే ఓ అరడజను పాత్రలతోనే ఈ కథ నడుస్తుంది. అడవి నేపథ్యంలో ఒక గిరిజన గూడెంలో జరిగే కథ ఇది. వెట్రి మారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత .. ప్రాధాన్యత కనిపిస్తాయి. అడవి సాక్షిగా జరిగే ఈ కథ అంచలంచెలుగా పట్టు బిగిస్తూ వెళుతూ ఉంటుంది.

మంచితనం .. మానవత్వం అమాయకత్వానికి ప్రధానమైన లక్షణాలుగా కొంతమంది భావిస్తుంటారు. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్న హీరో పోలీస్ గా ఫారెస్టు ప్రాంతానికి వెళతాడు. ఏ దళనాయకుడి కోసం డిపార్టుమెంట్ అంతా వెదుకుతూ ఉంటుందో .. ఆ ప్రమాదకరమైన వ్యక్తిని హీరో ఒక ప్రదేశంలో చూస్తాడు. అయితే అతను ఆ విషయం చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఆ వ్యక్తి వలన తాను ప్రేమించే అమ్మాయి ప్రమాదంలో పడినప్పుడు హీరోగా ఆ పోలీస్ ఏం చేశాడనేది ఆసక్తికరమైన అంశం.

ఈ కథను మొదటి నుంచి చివరివరకూ దర్శకుడు నడిపించిన తీరు .. అందుకోసం ఎంచుకున్న లొకేషన్స్ .. ప్రతి సన్నివేశాన్ని సహజత్వంతో ఆవిష్కరించిన విధానం ఈ సినిమా ప్రత్యేకత. కథ ఎక్కడా పట్టుసడలదు .. బలహీనుడైన హీరోను అనుసరిస్తూ ఆడియన్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇళయరాజా పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్ట్ లెవెల్ కి తీసుకునివెళతాయి. సూరి .. విజయ్ సేతుపతి .. భవానిశ్రీ నటనకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ఈ సినిమా చూసిన తరువాత, ‘కథ అంటే ఇది .. కంటెంట్ అంటే ఇది’ అనుకోకుండా మాత్రం ఆడియన్స్ బయటికిరారు అనేది వాస్తవం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్