మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఏక్‌నాథ్ షిండే వర్గానికి వ్యతిరేకంగా వస్తే సీఎం పదవికోల్పోయే పరిస్థితి నెలకొంది. అప్పుడు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేపడతారని, భవిష్యత్తులో సీఎం పీఠాన్ని అజిత్ పవార్ చేపడతారనే ఊహాగానాలు మహారాష్ట్రలో షికారు చేస్తున్నాయి. సీఎం ఏక్‌నాథ్ షిండే తాను సెలవుపై ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టం చేసినప్పటికీ తెరవెనుక మంత్రాంగం సాగుతోందని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు మరఠ్వాడ ప్రాంతంలోని దారశివ్‌లో(సుల్తానాబాద్) ఫ్యూచర్ సీఎం అజిత్ పవార్ అని పలుచోట్ల పోస్టర్లు వెలియడమే ఇందుకు కారణం. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి 2024 దాకా ఆగనవసరం లేదని స్వయంగా అజిత్ పవారే ఇటీవల ప్రకటించారు. ఏక్‌నాథ్ షిండేను సీఎం పదవి నుంచి తప్పించి ఫడ్నవీస్‌కు పట్టం కట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని ఒత్తిడి చేస్తున్నట్టు ఎన్సీపీ అధికార ప్రతినిధి క్ల్రెడ్ క్రాస్టో వెల్లడించారు. ఈ లెక్కన మహారాష్ట్ర సీఎం పదవిని శివసేన చీలిక వర్గం నుంచి బీజేపీ-ఎన్సీపీ లాక్కోవడం ఖాయమైపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏక్‌నాథ్ షిండే దిగిపోయే పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని ఎన్సీపీ, బీజేపీ సమానంగా పంచుకుంటాయని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే షిండే దిగిపోయినా లేదా రాజీనామ చేసిన తర్వాత మొదట ఆ సీట్లో ఎవరు కూర్చుంటారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే షిండే వర్గంపై సుప్రీం కోర్టులో అనర్హత వేటు పడకపోతే మరో ప్లాన్ అమలు చేయనున్నట్టు మంత్రి ఉదయ్ సమంత్ కొత్త విషయం బయటపెట్టారు. శివసేన ఠాక్రే వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరతారని ఆయన చెప్తున్నారు.