నాలుగేళ్ళలో ఒక్క దివ్యంగుడికి కూడా ట్రై సైకిల్ కూడా ఇవ్వలేని ఈ అసమర్ధ ప్రభుత్వం, పేదలకు ఏం సంక్షేమం అందించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సిఎం జగన్ నవరత్నాలు అంటూ చెబుతారని, ఇవి ఏమి రత్నాలని, నవ మోసాలు- రాలిపోయిన రత్నాలు అంటూ విమర్శించారు. ఈ రత్నాలు ఎవరి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చాయని నిలదీశారు. 2 లక్షల కోట్ల దోపిడీ, ఎమ్మెల్యేల దోపిడీ మరో2 లక్షల కోట్లు, పన్నుల పేరుతో బాదుడే బాదుడు మరో 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు… అంటూ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత నేతలతో బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో దళితుల కోసం ప్రవేశ పెట్టాల్సిన పథకాలపై వారితో సమీక్షించారు.
దళితుల అభ్యున్నతికి ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని, ఉద్యోగాల్లో- ప్రమోషన్లలో దళితులకు న్యాయం చేసింది తామేనన్నారు. టిడిపి దళితుల కోసం అమలు చేసిన పథకాలు, భవిష్యత్తులో వారికి అందించనున్న వాటిపై ఎప్పటికప్పుడు వారిలో అవగాహన తీసుకు వచ్చి, వారిని పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత నాయకులదేనని బాబు స్పష్టం చేశారు. దీనితో పాటుగా ఈ ప్రభుత్వం దళితులకు ఏవిధంగా అన్యాయం చేసిందో కూడా వివరించాలన్నారు. ఎంత పెద్ద నాయకుడైనా ప్రజల్లో తిరగకపోతే నాయకత్వం రాదని, అందుకే ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి వారి బాధలను అర్ధం చేసుకోవాలన్నారు. ఈసారి ఎన్నికల్లో మెజార్టీ దళిత ఓట్లు టిడిపికే పడే విధంగా కృషి చేయాలని సూచించారు.
ఫార్ములా పి-4 ప్రపంచానికే ఆదర్శంగా నిలవబోతుందని బాబు ధీమా వ్యక్తం చేశారు. పేదవారిని కోటీశ్వరులను చేయడమే తన ధ్యేయమన్నారు. పబ్లిక్-ప్రైవేట్- పీపుల్-పార్ట్నర్ షిప్ అనే కాన్సెప్ట్ అమలు చేయబోతున్నమన్నారు. మనం సృష్టించిన సంపద కొంతమందికే పరిమితం కాకూడదని, అందుకే ఫార్ములా పి-4 తెచ్చామన్నారు.