విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ… తనకు సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్నఅనుబంధాన్ని, నాటి స్మృతుల్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, బాలకృష్ణ కంటిచూపుతోనే చంపేస్తారని.. సరదాగా కామెంట్ చేయడం విశేషం.
ఇక సినిమాల్లో జీప్ ని బాలయ్య ఒక తన్ను తంతే అది ఇరవై ముప్పై అడుగులు వెళ్ళిపడే సీన్స్ మనం చూస్తుంటాం అని, అయితే.. అటువంటి పవర్ ఫుల్ సీన్స్ చేయాలి అంటే తాను కానీ, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు కూడా బాలకృష్ణకి సరిరారని అన్నారు. అంటే.. అటువంటి పవర్ ఫుల్ పాత్రలు ఆయనకు మాత్రమే సరిపోతాయనేది తన ఉద్దేశ్యమని రజినీకాంత్ తెలిపారు. ఇక తాను ఆరాధించే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారి శతజయంతి వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియచేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే మూవీ చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, సునీల్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగష్టులో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కాలానిధి మారన్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజ్ తో రజనీకాంత్ మూవీ చేయనున్నారని సమాచారం.