ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో వైస్రాయ్ హోటల్ కు వచ్చి సమర్ధించిన చరిత్ర రజనీకాంత్ కు ఉందని మాజీ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. అలాంటి రజిని నిన్నఇక్కడకు వచ్చి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని చంద్రబాబు విజన్ పై మాట్లాడారని విమర్శించారు. రామారావును యుగ పురుషుడు అంటూ ఇప్పుడు పొగుడుతున్న రజనీకాంత్ అప్పుడు ఆయన్ను క్షోభ పెట్టిన వెన్నుపోటులో ఎందుకు పాలుపంచుకున్నారని నిలదీశారు.
రామారావుకు వెన్నుపోటు పొడిచినవారంతా శత జయంతి సమయంలో ఒక చోటకు చేరి ఆయన్ను కీర్తించడం దారుణంగా ఉందన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ చూపించిన సంక్షేమ మార్గాన్ని; డా. బిఆర్ అంబేద్కర్-పూలే చూపించిన సామాజిక మార్గాన్ని అనుసరిస్తున్న వ్యక్తి సిఎం జగన్ అని ప్రశంసించారు. ఇలాంటి మహనీయుల అసీస్సులతోనే జగన్ పాలన కొనసాగుతుందని, వారి ఆశీస్సులు ఆయనకు ఉంటాయన్నారు. రజనీకాంత్ చెప్పిన డబ్బా కబుర్లు ఎవరూ నమ్మరని, అసలు ఆయన సినిమాలే ఇప్పుడు ఎవరూ చూడడం లేదని, అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ చెప్పిన మాటలు ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదని నాని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దాదాపు 17 కొత్త మెడికల్ కాలేజీలు జగన్ తీసుకొచ్చారని వీటి ద్వారా ఏటా 2550 మంది మెడిసిన్ చదివేందుకు వీలవుతుందని, వీటితో పాటు ప్రతి కాలేజీ కు అనుబంధంగా 500 పడకల ఆస్పత్రులు కూడా నిర్మిస్తున్నారని, వాటి చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకు ఉచితంగావైద్యం అందుతుందని కొడాలి వివరించారు. ఇన్నేళ్ళలో ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు చంద్రబాబు కట్టలేకపోయారని నాని ప్రశ్నించారు. బాబును మళ్ళీ సిఎం చేయాలని రజనీ చెప్పడంపై కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయిస్తుంటే ఏం చేశారని నిలదీశారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే ఆరురోజులు హాస్పటల్ లో పడుకున్తారంటూ రజనీపై ఘాటుగా వ్యాఖ్యానించారు.