Saturday, November 23, 2024
HomeTrending Newsఅంతర్జాతీయ ఖ్యాతి ఎవరిగొప్ప?

అంతర్జాతీయ ఖ్యాతి ఎవరిగొప్ప?

Ramappa Temple :

రామప్ప దేవాలయం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న రామప్ప ఆలయం తెలుగు రాష్ట్రం ఖ్యాతిని ఇనుమడింప జేసింది. కాకతీయుల శిల్పకళా వైభవానికి అద్దం పట్టిన రామప్ప ఆలయం తెలంగాణలో వుంది. రామప్పకు దక్కిన క్రెడిట్ అంతా తెలంగాణ ప్రజలకూ దక్కుతుంది. మరీ చెప్పాలంటే తెలుగు ప్రజలందరికీ ఆ ఖ్యాతి దక్కుతుంది. ఇది దేశానికీ గర్వకారణం.

ఇదంతా సరేగానీ రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడానికి కారణం ఏంటి? రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని ప్రశ్నించినట్లు ఇదేం ప్రశ్నరా బాబూ అనుకుంటున్నారా? కాకతీయుల శిల్పకళా నైపుణ్యం వల్లే ప్రపంచ హెరిటేజ్ జాబితాలోకి వచ్చిందికదా అని ఎదురు ప్రశ్నిస్తారా! ఆయితే మీరంతా పప్పులో కాలేసినట్టే.

అదేనండీ ఇప్పుడు ఇదే విషయం పెద్ద సమస్యై కూచుంది. రామప్ప దేవాలయానికి వచ్చిన ఖ్యాతి ఇప్పుడు ఎవరి పొలిటికల్ మైలేజ్ లోకి రావాలి?రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ మైలేజ్ లోకా లేక కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ జేబు లోకా? ఇరు పార్టీల నేతలు రామప్ప క్రెడిట్ తమదంటే..తమదని పెద్దగానే బాకాలు ఊదుతున్నారు. ఆసలు ఆలయాన్ని నిర్మించిన కాకతీయుల విషయం పక్కన పెట్టి ప్రస్తుతం రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు, ఎదుటి వారిపై వేస్తున్న సెటైర్లు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అవునుమరి ఏ చిన్న అవకాశాన్నీ వదులు కోవడానికి ఇష్టపడని రాజకీయ పార్టీలు రామప్ప విషయంలోనూ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడానికి తెగ ఉబలాట పడుతున్నాయి.

వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లితో పాటు మిగిలిన మంత్రులు   రామప్పకు దక్కిన ఖ్యాతి అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ అకౌంట్ లోకే వస్తుందని కుండబద్దలు కొట్టారు. ఆ ఘనత టీఆర్ఎస్ దే అంటూ అతిగానే స్పందించారు. రామప్ప విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వతహాగా నివేదిక సిద్దంచేసి, ప్రపంచ దేశాలనూ మెప్పించ గలిగారని అందుకే ఇంతటి గొప్ప అవకాశం మనకు దక్కిందని ఎర్రబెల్లి ఒక అడుగు ముందుకు వేసి మరీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు రామప్ప దేవాలయాన్ని మాత్రమే పంపలేదన్న మంత్రి ఆ జాబితాలో మరో ప్రాంతం పేరునూ సిఫార్సు చేసిందని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదని సెలవిచ్చారు.

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం తమ గొప్పేనని టీఆర్ఎస్ మంత్రులు చాటింపు వేసుకోవడం సహజంగానే తెలంగాణా బీజేపీ నేతలకు చిర్రెత్తేలా చేసింది. కేంద్ర ప్రభుత్వం చొరవ వల్లనే  రామప్పకు ప్రపంచ గౌరవం దక్కిందని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. బిజేపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రామప్ప దేవాలయం విషయంలో అన్ని దేశాలను ప్రధాని మోదీ ఏకాభిప్రాయానికి తీసుకురాగలిగారని  ఆ క్రెడిట్ అంతా బీజేపీకే దక్కాలని చెప్పుకొచ్చారు.

ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ పొందిన కిషన్ రెడ్డికి కల్చర్ అండ్ టూరిజం అభివృద్ధి శాఖ రావడం కొద్ది రోజులకే రామప్ప ఆలయాన్ని యునెస్కో , ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ప్రకటించడాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఏదేమయినా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ హుజురాబాద్ ఉప ఎన్నిక వైపు చూస్తున్న వేళ  ఇటు అధికార టిఆర్ఎస్, అటు బిజెపి ఏ విషయం దొరికినా దానిని ప్రచారాస్త్రంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుని ప్రజలకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

Ramappa Temple :

రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి యావత్ దేశానికే గర్వకారణం .ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వ ఉమ్మడి కృషితోనే  ఇది సాధ్యం అయ్యింది.  ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడగా, కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయం ఈ ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకుంది.  యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచం వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. కాకతీయుల అపురూప శిల్పకళా నైపుణ్యానికి ఇదే నిదర్శనం. విశిష్టమైన వారసత్వాన్ని కలిగి ఉన్న కాకతీయుల వైభవానికి చిహ్నంగా నిలిచిన రామప్ప దేవాలయం చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరగాలని కోరుకుందాం. తెలుగు నేలలో వున్న మరెన్నో ప్రాచీన కట్టడాలు వైభవానికి ఇదో స్పూర్తి కావాలని కోరుకుందాం.

-వెలది కృష్ణ కుమార్

Also Read : చరితకు శిలా తోరణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్