నిజమైన పాపం పసివాడు పవన్ కళ్యాణ్ అని, నోట్లో వేలు వేసుకొని చంద్రబాబు వెంట పరిగెడుతున్నాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ ను నమ్ముకుంటే సరాసరి గంగలో దూకాల్సి వస్తుందని, ఈ విషయంలో యువత ఆలోచించుకోవాలని హితవు చెప్పారు. రాష్ట్రంలో ధనికులందరూ ఒకవైపు, పేదలందరూ మరోవైపు ఏకమవుతున్నారని, పేదలు జగన్ పక్షాన నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు దళిత ద్రోహి అని, కంటేపూడి దళితులకు ఆశపెట్టి మోసం చేశారని, దీనికి సమాధానం చెప్పకుండా పారిపోయారన్నారు. అలాంటి వ్యక్తికి పవన్, జనసేన సపోర్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. సత్తెనపల్లిలో తన ఓటమే లక్ష్యంగా జనసేన, టిడిపిలు పని చేస్తున్నాయని.. ఎంతమంది ఏకమైనా.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా .. ప్రజలు, సిఎం జగన్ ఆశీస్సులు ఉన్నంతకాలం ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
అమరావతిలో పేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే అడ్డుకోవడం సరికాదని, మొత్తం 33 వేల మంది రైతులు భూములిస్తే వారిలో పది మంది కోర్టుకు వెళ్ళారని… వారిలో బాబు పరకాయ ప్రవేశం చేసి పెద్ద పెద్ద లాయర్లతో వాదించారని అంబటి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ జగన్ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందని దీనిలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. వందమంది చంద్రబాబులు, వెయ్యిమంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా పేదలకు పట్టాలు ఇచ్చి తీరుతామన్నారు.