మణిపూర్‌లో ఈ రోజు (సోమవారం) మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. రాజధాని ఇంఫాల్‌లో పలు ఇండ్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే మంటల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అధికారులు ఆర్మీ, అసోం రైఫిల్స్, మణిపూర్ పోలీసు బలగాలను మోహరించారు.
అయితే, ఇంఫాల్ ఈస్ట్‌లోని న్యూ చెకాన్‌లో ఓ కమ్యూనిటీకి చెందిన దుకాణదారులు దుకాణాన్ని మూసివేయాలని ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత గుర్తు తెలియని దుండగులు నాలుగు ఇండ్లకు నిప్పు పెట్టినట్లుగా తెలుస్తున్నది. ఇప్పటి వరకు ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేని అధికారులు పేర్కొన్నారు. మరోసారి హింసాత్మక ఘటన నేపథ్యంలో అసోం రైఫిల్స్, మణిపూర్ పోలీసులను మోహరించారు. అలాగే హెంగ్లెప్ మాజీ ఎమ్మెల్యే టియెన్ హాకిప్‌తో పాటు ఇద్దరు అంగరక్షకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.