భావి తరాల తలరాతలు మార్చేందుకు తాము ఖర్చు పెట్టే ప్రతిపైసా మానవ వనరులమీద పెట్టుబడులు పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యారంగంలో రాబోయే రోజుల్లో దేశానికే ఓ దశ, దిశ ఆంధ్రప్రదేవ్ చూపించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన సమాజంలో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాల తలరాతలు మారాలని, వారినుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు రావాలని, దీనికి చదవులు ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన కార్యక్రమంలో జగనన్న విద్యా దీవెన కింద జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించిన నిధులను విద్యార్థుల తల్లుల అకౌంట్లలోకి జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు.
చదువు అన్నది పేదలకు ఒక హక్కుగా అందాలని, దానికోసమే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, పూర్తి ఫీజులను చెల్లిస్తూ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికంలోనూ జమ చేస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు ఇచ్చారని… కానీ తాము పూర్తి ఫీజు చెల్లిస్తున్నామని చెప్పారు. తాము ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తుంటే… రాష్ట్రం దివాళా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అనేది విమర్శలు చేస్తున్నవారు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు.
గతంలో పేదవాడి గురించి, పేదరికం పోవాలంటే.. ఏంచేయాలన్న దాని ఆలోచన చేయలేకపోయారని, దోచుకోవడం ఎలా, పంచుకోవడం ఎలా అన్నదే వారి ఆలోచన అని సిఎం జగన్ దుయ్యబట్టారు
ఇప్పుడు తోడేళ్లంతా ఏకమవుతామంటున్నారని, ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌వార్ అని చెప్పారు. దీనిలో పేదవాడు ఒకవైపున, పెత్తందార్లు మరోవైపున ఉన్నారని అన్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని అబద్దాలు విపక్షాలు చెబుతాయని… కానీ మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోవాలని… మంచి జరిగితే.. జగనన్నకు తోడుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నా బలం మీరే.. నా నమ్మకం మీరే’ అంటూ … రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ దీవెనలు ఉండాలని జగన్ కోరారు.