మహానాడు పేరుతో రాజమండ్రిలోని రోడ్లన్నీ ధ్వంసం చేస్తున్నారని, మిషన్లు తీసుకొచ్చి గుంటలు పెడుతున్నారని పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ విమర్శించారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం జరిగిన చోట తెలుగుదేశం జెండాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడవడం ఎందుకు, ఇప్పుడు ఆయన శతజయంతి ఉత్సవాలు జరపడం దేనికని ప్రశ్నించారు.వ బాబు చర్యలతో ఎన్టీఆర్ ఆత్మ ఎప్పటికీ క్షోభిస్తూనే ఉంటుందని అన్నారు.
రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో మహానాడు చేస్తున్నారని.. కానీ నగరంలో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే రాజమండ్రిలో పుష్కరాల సమయంలో 32 మందిని పొట్టన బెట్టుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ మరణం తర్వాత కొన్ని వదల మంది చనిపోతే వారి కుటుంబాలను వైఎస్ జగన్ ఓదార్పు యాత్రతో పరామర్శించారని… కానీ పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలను బాబు గానీ, ఆయన కుమారుడు లోకేష్ గానీ ఏనాడైనా పరామర్శించారా అని భరత్ నిలదీశారు.
మహానాడు సందర్భంగా ఇరుకు సందుల్లో సభలు పెట్టి తొక్కిసలాటకు గురైతే దానికి తెలుగుదేశం పార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని భరత్ హెచ్చరించారు. రాజమండ్రి ఎంపిగా తాను ఉన్నా కాబట్టి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతున్నాని, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.