కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రెవిన్యూ లోటు నిధులపై కొదరు విశ్లేషకులు, కొన్ని మీడియా సంస్థలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జివీఎల్ నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే ఎన్ని నిధులు రాష్ట్రానికి మూడున్నర ఏళ్ళలో వస్తాయో అంతకుమించి నిధులు కేంద్రం రాష్ట్రానికి ఇస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. విశాఖపట్నం బిజెపి కార్యాలయంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ఏదో ఒక పార్టీకి లాభం చేయడానికి నిధుల విడుదల అనేది ఉండదని,  దీనిపై రాజకీయ కోణంలో అలోచించడం మానుకోవాలన్నారు.  ఆ నిధులు ఇచ్చి, వేరే నిధులు ఆపేస్తామని కేంద్రం చెప్పిందంటూ కొందరు చేస్తున్న వాదనపై కూడా ఆయన మండిపడ్డారు. ‘మీ చెవిలో ఏమైనా చెప్పారా’ అంటూ ప్రశ్నించారు.

పన్నుల వాటా నిధులు కూడా ఇవ్వరనేది కేవలం దిగజారుడు ఆరోపణ మాత్రమేనని కొట్టిపారేశారు.  తెలుగుదేశం పార్టీకి వైసీపెపై ఏదైనా ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలని, తాము కూడా ప్రభుత్వంపై ఛార్జ్ షీట్లు వేస్తున్నామని చెప్పారు.  నిధులు సద్వినియోగం అవుతాయో లేవో చూడాలని, కొంతకాలం క్రితమే ఇచ్చిఉంటే బాగుండేదని కూడా చెప్పవచ్చని కానీ… నిధులు ఇవ్వొద్దని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున పడేయాలని చెప్పడం సహేతుకం కాదన్నారు.

వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు  వ్యవహారంపై జీవీఎల్ స్పందించారు సిబిఐ ఎవరినైనా అరెస్టు చేయాలనుకుంటే ఎవరు అడ్డుపడ్డా, ఏ స్థాయికి వెళ్లి అయినా చేస్తుందని స్పష్టం చేశారు. రౌడీయిజంతోనో, ఫ్యాక్షనిజంతోనో సిబిఐ నుంచి తమను తాము రక్షించుకోచ్చని ఎవరైనా అనుకుంటే అది సాధ్యమయ్యే పనికాదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరికి వారు తమకు తోచిన విధంగా వ్యాఖ్యలు చేయకుండా కొంత సంయమనం పాటించాలని, ఓపిక పట్టాలని సూచించారు. ఎప్పుడు ఏమి చేయాలో సిబిఐకి తెలుసని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *