దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా టి. ఆర్.ఎస్ పార్టీ తన కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా గుర్తించి వారికి బీమా వసతి కల్పించిందని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. టి.ఆర్.ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజలు తమ రక్షణ కవచంగా భావిస్తున్నారని చెప్పారు. టీ.ఆర్.ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నేడు ఆసిఫాబాద్ లో సిర్పూరు – కాగజ్ నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల పార్టీ సభ్యత్వ నమోదుపై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమీక్ష చేశారు.
వెనుకబడిన ఈ ప్రాంతంలో పథకాల కింద ఎక్కువ మందికి లబ్ది చేకూర్చేందుకు సీఎం కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారని, కొమురభీం జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసిఆర్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. టీ.ఆర్ ఎస్ పార్టీ ఏ లక్ష్యంతో ఉద్యమం చేసిందో దానిని నెరవేర్చే విధంగా పని చేస్తుందని, గొప్పలు చెప్పుకునే జాతీయ, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా బీమా కల్పించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జిల్లా నాయకులు పాల్గొన్నారు.