Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Movie shows the effects of how deeply racism is carved into people : A time to Kill

పదేళ్ల నీగ్రో పసికందును ఇద్దరు శ్వేత జాతీయులు బలాత్కారం చేస్తే, ఆ పిల్ల తండ్రి ఆ ఇద్దర్నీ కోర్టు ఆవరణలోనే చంపేస్తే, ఆ దాడిలో ‌ఓ పోలీసు కూడా గాయపడితే, ఆ తండ్రిని రక్షించడానికి ఓ ఉదారవాద శ్వేతజాతి లాయర్ సిద్ధపడితే, ఆ‌ చనిపోయినవారి బంధుగణం ప్రతీకారానికి తెగబడితే, చివరాఖర్లో న్యాయం గెలిస్తే…?

అదే “ఎ టైమ్ టు కిల్” (A time to Kill ) చిత్రకథ..!

ఈ సినిమాని ఇదే పేరుతో వచ్చిన జాన్ గ్రిషామ్ నవల ఆధారంగా తీసారు. అమ్మాయి తండ్రిగా శామ్యూల్ జాక్సన్ నటన చాలా ‌బావుంటుంది.

ఏ‌దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం అన్న శ్రీశ్రీ మాటలు ఈ సినిమా చూస్తున్నంత సేపూ గుర్తొస్తుంటాయి.

ఒక్కోసారి చావడం కంటే బ్రతకడమే ఎక్కువ కష్టం అనిపిస్తుంది. మనకి కష్టం వస్తే బాధ; కానీ మన కన్నకడుపుకు వస్తే అది నిత్యనరకం…! బలాత్కరింపబడ్డ పదేళ్ల పసిదాని గర్భసంచీ తీసేస్తారు. ఆ‌విషయం మాట్లాడుకుంటున్న ‌తల్లిదండ్రులైన ఆ దంపతుల సంభాషణ హృదయవిదారకంగా ఉంటుంది.దోపిడీ అన్ని వర్గాల్లో ఉంటుంది; జాత్యాభిమానం అన్ని జాతులకూ ఉంటుంది; సమానత్వం సాధించాల్సిన బాధ్యత ఆధిపత్యవర్గాల మీద ఎక్కువగా ఉంటుంది అనే విషయం కూడా సున్నితంగా ప్రస్తావించే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది.

కార్ల్ లీ హైలీతో నల్లజాతి పాస్టరు తమజాతి లాయర్నే కేసు వాదించడానికి తీసుకుందామని వత్తిడి చేస్తాడు.

సరైన ఠికాణా లేని జేక్ బ్రిగాన్స్ ని ఒత్తిడి తట్టుకోలేక ‌తన భార్య వదిలేసి పుట్టింటికి కూతురుతో సహా వెళ్లిపోతుంది‌. తను సహాయకురాలైన ఎలెన్ రోర్క్ ఓ సాయంత్రవేళ “నన్ను ఇంట్లో ఈ రాత్రికి ఉండమంటావా…?” అని అడిగితే, “ఉండమనాలనే ఉంది. అందుకే వెళ్లిపో..!” అని జేక్ చెప్పడం ఓ ప్లేటోనిక్ కాని, బాధ్యతాయుతమైన బంధాన్ని ఆవిష్కరిస్తుంది.

కార్ల్ ఓ సందర్భంలో జేక్ సమగ్రతని అనుమానిస్తాడు. “మనం ఎప్పటికీ ఒక్కటవలేం..!” అంటూ నిర్వేదంతో డీలా పడతాడు.

మనలో చాలామంది కార్ల్ చేసిన జంటహత్యలతో సహానుభూతి చెందుతాము. గాయపడ్డ పోలీసు కూడా కార్ల్ కి మద్దతుగా కోర్టులో వాంగ్మూలం ఇస్తాడు.

కార్ల్ జేక్ తో “శ్వేతజాతీయులు నాగురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి నేను ఉపయోగిస్తున్న రహస్య ఆయుధానివి నువ్వు. నువ్వే గనుక జడ్జీవైతే నన్ను వదిలేస్తావా..?” అంటాడు.

క్లైమాక్స్ లో జేక్ చివరి కోర్ట్ ప్రసంగం పోర్నోగ్రాఫిక్ డిటైలింగ్ లా ధ్వనించినా అది అవసరం.ఆ పసికూన పట్ల జరిగిన అమానవీయ సంఘటనని జేక్ వివరిస్తుంటే, చెమర్చని కన్నుండదు. చివరికి “ ఆ పసిప్రాణం ఓ శ్వేతజాతీయురాలైతే మీరేం చేస్తారో ఆలోచించి, తీర్పునివ్వండి” అనడం ఓ నిశ్శబ్ద విస్ఫోటనం.

న్యాయశాస్త్రం, న్యాయం రెండూ గమ్మత్తనిపించినా వేర్వేరు అంశాలు. కార్ల్ చేసింది న్యాయంగా చెప్పాలంటే న్యాయం. కానీ న్యాయశాస్త్రం ప్రకారం నేరం. ఆ నేరాన్ని నిరూపించడానికి ఉద్దండుడైన ప్రాసిక్యూటర్, విపరీతమైన డబ్బులూ పోగుపడతాయి. చివర్లో కోర్టు కార్ల్ కేసుమీద తీర్పునిచ్చాక ఓ నల్లకుర్రాడు “ఇన్నోసెంట్” అంటూ బైటికి రావడం సరైంది కాదేమో…! “అక్విటెడ్” అంటే ఇంకా బావుండేదేమో..!

సమాజం ఎంత మేకతోలు కప్పుకున్నా, బడుగులను కబళించే పులేననీ, మేకల్లో కొన్ని బ్లాక్ షీప్స్ అనివార్యంగా ఉంటాయనీ వాస్తవాలు చెబుతూనే,. కార్ల్ ఇంట్లో విందుకి జేక్ కుటుంబసమేతంగా వెళ్లడం అనే ఆశావహమైన ముగింపునివ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది.

-గొట్టిముక్కల కమలాకర్

Also Read : గోరంత దీపం – కొండంత వెలుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com